సంగారెడ్డి జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి. వీటిలో ఆరు మండలాల్లో ఐఈఆర్సీ(ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్) పేరిట భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సేవలు నామమాత్రంగా అందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది.
ఐఈఆర్సీ కింద మూడు నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు సాధారణ పాఠశాలల మాదిరిగా ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. వీటిలో బోధించేందుకు ప్రత్యేకంగా ఐఈఆర్పీలు ఉంటారు. వారంలో ఒక రోజు ఫిజియోథెరపీ వైద్యాన్ని థెరపిస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మిగిలిన అయిదు రోజుల్లో ఐఈఆర్పీ ఆటపాటలు.. బొమ్మలతో బోధన చేయిస్తుంటారు. మానసిక వైక్యలంతో పాటు వినికిడిలోపం, శారీరక వైకల్యం ఉన్న వారికి అందుకు తగిన పరికరాలు అందిస్తున్నారు.
గతేడాది 320 మంది విద్యార్థులు
జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లలు 1,682 మంది ఉన్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. ఆరు భవిత కేంద్రాలు ఉన్నాయి. గతేడాది 320 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుత సంవత్సరం 105 మంది అదనంగా పెరిగారు. పిల్లలకు అందుతున్న సేవలు భవిష్యత్తులో అందించాలన్న విషయమై ప్రత్యేకంగా 21 అంశాలపై సర్వే చేశారు. దీని ఆధారంగా వారు గుర్తించిన సమస్యలను పరిష్కరించనున్నారు.