భూ సమస్యలు పరిష్కరించేలా అధికారులు యత్నాలు.. పెండింగులో వాటిని మోక్షం..! Land problems of farmers in Sangareddy: ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి అనేక భూ సమస్యలు తలెత్తాయి. రైతులు రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా కొంతమందికి ఫలితం లేకుండా పోయింది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. కొన్ని సమస్యల పరిష్కారానికి పోర్టల్‌లో ఆప్షన్లు లేకపోవడం ప్రధాన సమస్యగా నిలిచింది. ఆప్షన్లు వచ్చిన తర్వాత కూడా పని ఒత్తిళ్ల వల్ల దరఖాస్తులకు పరిష్కారం లభించలేదు.
దీంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకున్నారు. జిల్లా పరిధిలోని 26మండలాలకు చెందిన రెవిన్యూ సిబ్బందితో కలెక్టరేట్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి మండలం నుంచి తహశీల్దార్‌తోపాటు ఇతర సిబ్బంది భూ రికార్డులతో సహా ఈ శిబిరానికి వస్తున్నారు. రికార్డులు పరిశీలించి, దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు.
ప్రతి రోజు 350మందికిపైగా రెవిన్యూ సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు సైతం ఈ శిబిరంలోనే ఉండి ఎప్పటికప్పుడు దస్త్రాలపై సంతకాలు చేస్తున్నారు. ఒక్క గుంట భూమి నిషేధిత జాబితాలో ఉన్నా, ఆ సర్వే నెంబర్‌లోని మొత్తం విస్తీర్ణాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తమ అవసరాలకు భూమిని అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ శిబిరంలో మొదట నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించారు. వారం రోజుల్లో 29వేల సబ్ డివిజన్ సర్వే నెంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీంతోపాటు ఇతర సమస్యలతో ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న 6500 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ నెల చివరి నాటికి దరఖాస్తులన్నీ పరిష్కరించి రెవిన్యూ సమస్యలు లేని జిల్లాగా సంగారెడ్డిని ప్రకటించే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు.
ఇవీ చదవండి: