తెలంగాణ

telangana

ETV Bharat / state

భూగర్భజలం.. ఆశాజనకం

వేసవి వచ్చిందంటే సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. లాక్‌డౌన్‌ ప్రభావంతో పరిశ్రమలు మూతపడటంతో నీటి వినియోగం తగ్గింది. పంటలు ముందుగానే చేతికి రావడం వల్ల సాగుకు అవసరం లేకుండా పోయింది. దీనికి తోడు అడపాదడపా వర్షాలు కురవడంతో జిల్లాలో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లుగా భూగర్భ జలశాఖ అధికారుల నివేదిక స్పష్టం చేస్తోంది.

By

Published : May 15, 2020, 8:16 AM IST

Sangareddy district latest news
Sangareddy district latest news

సంగారెడ్డి జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి. సగటున గతేడాది ఏప్రిల్‌లో 23.47 మీటర్ల నీటి మట్టం ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 21.85 మీటర్లకు చేరింది. నిరుడి కంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో 1.62 మీటర్ల మేర నీటి మట్టం పెరిగినట్టుగా లెక్కలు చూస్తే తెలుస్తోంది. అమీన్‌పూర్‌, అందోలు, హత్నూర, ఝరాసంగం, జిన్నారం, కల్హేర్‌, కంది, మనూరు, మొగుడంపల్లి, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్‌, రామచంద్రాపురం, రాయికోడ్‌, సిర్గాపూర్‌ ఇలా 14 మండలాల్లో నీటి మట్టం పెరగటం గమనార్హం. ఇది ఊరట కలిగించే అంశమని, ఖరీఫ్‌ సాగుకు కలిసిరానుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కంగ్టి, కోహీర్‌, కొండాపూర్‌, మునిపల్లి, న్యాల్‌కల్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్‌ మండలాల్లో జలాలు పాతాళానికి పడిపోయాయి. తాగు, సాగు బోరుబావులు పని చేయటం లేదు. మరోవైపు గుమ్మడిదల, పుల్కల్‌, వట్‌పల్లి, సదాశివపేట నాలుగు మండలాల్లో నీటిమట్టంలో గతేడాది ఏప్రిల్‌, ఈ ఏడాది ఏప్రిల్‌కు స్వల్ప తేడా మాత్రమే నమోదయింది.

కంగ్టిలో మరింత లోతుల్లోకి...

కంగ్టి మండలంలో పూర్తిగా పడిపోయింది. గతేడాది ఏప్రిల్‌లో 7.90 మీటర్ల మేరకు నీటి మట్టం ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో 18.96 మీటర్లకు దిగజారడం గమనార్హం.

జిన్నారంలో పైపైకి...

జిల్లాలో అత్యధికంగా జిన్నారం మండలంలో జలమట్టం పెరిగింది. నిరుడు ఏప్రిల్‌లో ఇదే మండలంలో 29.84 మీటర్ల నీటి మట్టం ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 19.27 మీటర్లకు చేరింది. 10.57 మీటర్ల మేరకు నీటి మట్టం పైపైకి వచ్చినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details