సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హన్మంతరావు... ఆరోగ్య సమాజాన్ని నిర్మించే పోషణ్ అభియాన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలను సమన్వయం చేసి.. పథకాన్ని పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో సేవలందించే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు.. శిక్షణ, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు.
అవగాహన కల్పించారు
గ్రామాల్లో పౌష్టికాహార లోపంతో ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి సరైన ఆహారం అందేలా చేశారు. రక్తహీనతతో ఉన్న కిశోర బాలికలను గుర్తించి.. మందులు అందించారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. వంద శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మాత, శిశు మరణాలు తగ్గించేలా చర్యలు చేపట్టారు.