సంగారెడ్డి జిల్లా కంది మండలం బక్షి బేగంపేట గ్రామంలోని చెరువులో పోలీసుల, అధికారుల సమక్షంలో గంగపుత్రులు, మత్స్య సహకార సంఘం సభ్యులు చేపలు పట్టారు. కొంత కాలంగా ముదిరాజ్ సంఘం నేతలు గంగపుత్రులను చేపలు పట్టుకోకుండా అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో అనేక సార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా గంగపుత్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవలే కోర్టులో భక్షి గంగపుత్ర మత్స్య సహకార సంఘానికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు చేపలు పట్టే సమయంలో గంగపుత్రులకు పోలీస్ అధికారులు భద్రత కల్పించగా... గంగపుత్రులు చేపలు పట్టారు.
భద్రతా నీడలో చేపలు పట్టిన గంగపుత్రులు
సంగారెడ్డి జిల్లా.. బక్షి బేగంపేట గ్రామంలో గంగపుత్రుల, మత్స్య సహకార సంఘం వారు చేపలను పట్టారు. ముదిరాజ్ సంఘం వారు కొందరు చేపలు పట్టనియ్యకుండా అడ్డుపడటంతో అధికారులు సమక్షంలో ఈ పని చేపట్టారు.
గంగపుత్ర, మత్స్య సహకార సంఘం
1980లో వారి మత్స్య సహకార సంఘం ఏర్పాటు అయ్యిందని.. అప్పటి నుంచి వారి గ్రామంలో గంగ పుత్రులు మాత్రమే చేపలు పడుతున్నట్లు గంగపుత్ర మత్స్య సహకార సంఘం నేతలు వివరించారు. ఈ విషయమై ముదిరాజ్ కులస్థులు తమలో కొందరికి చేపలు పట్టే అవకాశం కలిపించాలని అధికారులకు, కోర్టుకు విన్నవించగా కోర్టు తిరస్కరించి మత్స్య సహకార సంఘానికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. చేపలు పట్టే కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్షీ మత్స్య సహకార సంఘం నేతలు, గంగపుత్రులు పాల్గొన్నారు.
Last Updated : Apr 25, 2021, 8:12 PM IST