Farmers problems with Dharani Portal : ధరణిలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో సంగారెడ్డి జిల్లాలోని రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మీ సేవా కేంద్రాల్లో అన్ని పత్రాలతో దరఖాస్తులు చేసుకున్నా... ఎలాంటి కారణం చూపకుండానే వాటిని తిరస్కరిస్తుండటంతో కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ అడుగుతున్నారు. భూ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను అన్నదాతలు వేడుకుంటున్నారు. కొన్ని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో భూమిని అమ్ముకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. భూ విస్తీర్ణంలో వ్యత్యాసం, కొందరి పేర్లు తప్పుగా నమోదవడం తదితర కారణాలతో రైతు బంధుకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేడుకుంటున్న రైతులు
సంగారెడ్డి జిల్లాలోని రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ధరణి అందుబాటులోకి వచ్చాక తమ కష్టాలు రెట్టింపు అయ్యాయని కొందరు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం రోడ్లు, ప్రాజెక్టులు కోసం కొంత భూమిని సేకరిస్తే.. ఇప్పుడు ఆ సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భూమిని అమ్ముకోలేక పోతున్నామని గోడు వెల్లబోసుకుంటున్నారు.
రైతుబంధు కూడా వస్తలేదు..
ధరణిలో వివరాలు నమోదు చేసే సమయంలో కొందరు రైతులకు ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణం పాసు పుస్తకాల్లో నమోదైంది. మరికొందరి పేర్లు తప్పుగా ఉన్నాయి. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న భూమి అసలు చేర్చనే లేదు. ఈ నేపథ్యంలో రైతుబంధు కూడా అందుకోలేకపోతున్నారు. తమ సమస్య తీర్చాలని మీసేవా కేంద్రాల్లో నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా... ప్రయోజనం లేదని చెబుతున్నారు. కనీసం తమ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారోననే విషయం కూడా అధికారులు చెప్పడం లేదని వాపోతున్నారు.
ప్రజావాణికి తరలివస్తున్న రైతులు
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకూ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. ఆయన మీద కూడా పని భారం ఎక్కువైంది.ఈ కారణంగా దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోందని అధికారవర్గాలు అంటున్నాయి. తహసీల్దార్ల చుట్టూ తిరిగి అలసిపోతున్న రైతులు.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి బారులు తీరుతున్నారు. ఉన్నతాధికారులైనా తమ గోడు వింటారనే గంపెడాశతో ఇక్కడికి వస్తున్నా... తమకు ఉపశమనం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా భూమి కొంత రోడ్డుకు పోయింది. నాలుగు గుంటల భూమి పోయింది. మాకు ఎకరం 23 గుంటల భూమి ఉంటే... మొత్తమే తీసేశారు. మాకు రైతుబంధు వస్తలేదు. లోను కూడా వస్తలేదు. ధరణిలో లేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నాం. మీసేవాలో దరఖాస్తు చేస్తున్నా కూడా అవడం లేదు.
-సంగయ్య, బాధిత రైతు