సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోలేదు. రికార్డు స్థాయిలో ఈసారి దిగుబడి వచ్చినా... వడ్లు అమ్ముకునేందుకు(paddy procurement in telangana) రైతులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఈ సారి 151 చోట్ల కొనుగోలు కేంద్రాలు(paddy procurement in telangana) ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటికే 125 చోట్ల వాటిని ప్రారంభించామని పేర్కొన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కేంద్రాలు పేరుకే ఏర్పాటు చేసినా... కొనుగోళ్లు మొదలు పెట్టలేదని రైతులు వాపోతున్నారు. అందోల్, కల్హేర్, పుల్కల్, చౌటకూర్ మండలాల్లో రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాన కురిస్తే అంతే..
కల్హేర్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే అయిదు రోజుల క్రితం కేంద్రం ప్రారంభించారు. కానీ ఇక్కడ కొనుగోళ్లు మొదలు కాలేదు. చాలా చోట్ల కోతలు మొదలై చాలా రోజులైనా ఇంకా కేంద్రాలు తెరవని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని చాలా చోట్ల రహదారుల పొడవునా ధాన్యం కనిపిస్తోంది. మంచు కురుస్తుండటంతో రోజూ ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరిగి కుప్ప చేయడం పనిలోనే రైతులు నిమగ్నమవుతున్నారు. వాన పడితే నోటికందే కూడు నీళ్ల పాలవుతుందని ఆవేదన చెందుతున్నారు.
మేం వరికోసి 20 రోజులు అవుతోంది. ఇక్కడ ఎండబోశాం. ఇవాళే టోకెన్లు ఇచ్చారు. వర్షం వస్తదేమోనని భయమేస్తుంది. జర తొందరగా కొనుగోలు చేయాలి. ఇంకా రైస్ మిల్లులకు వరిమిషన్లు రాలేదని చెబుతున్నారు. అదంతా పూర్తి చేసి తొందరగా కొనాలని కోరుతున్నాం.
- మల్లేశం, రైతు
నాలుగు సంవత్సరాల నుంచి ఆందోల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టేవాళ్లు. కానీ ఈసారి మాత్రం లేదు. మేం అధికారులను అడిగితే... ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు చేయలేదు. రైతులంతా కూడా 15-20 లోడుల వరి ధాన్యాన్ని అక్కడక్కడా కుప్పలు పోసి.. ఆరబోశారు. వడ్లు కూడా బాగా ఎండినయి. జోగీపేట నుంచి కనీసం సంచులు ఇవ్వమన్నా ఇస్తలేరు. అక్కడికి ధాన్యం తీసుకెళ్దామంటే మార్కెట్లో ప్లేస్ లేదు.
-మధుసూదన్ రెడ్డి, రైతు