Sangareddy Collectorate To Get ISO Recognition: సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఉమ్మడి రాష్ట్రంలోనే.. ఓ మోడల్ కలెక్టరేట్. సువిశాలమైన ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలున్ని ఒకే ప్రాంగణంలో ఉండేలా నిర్మించారు. 2లక్షల 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన గదులు సభలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సుల కోసం ప్రత్యేకంగా హళ్లు నిర్మించారు. 2005లో నిర్మాణం ప్రారంభించి.. 2010లో పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జీ+2 తరహాలో నిర్మించిన తొలి కలెక్టరేట్ ఇదే. కేవలం భవనాలకే కాక.. పచ్చదనానికి సైతం అధిక ప్రాధాన్యమిచ్చారు.
ఎన్నో ప్రత్యేకతలున్న కలెక్టరేట్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి నిర్వహణ ప్రమాణాలు, పారదర్శకతకు ఐఎస్ఓ 9001 సర్టిఫికేట్.. పర్యావరణ నిర్వహణ ప్రమాణాలు పాటించే కార్యాలయాలు, సంస్థలకు ఐఎస్ఓ 14001 సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ రెండు గుర్తింపులు సాధించే అర్హత సంగారెడ్డి కలెక్టరేట్‌కు ఉండటంతో.. అధికారులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు గుర్తింపు సంస్థల ప్రతినిధులు కలెక్టరేట్‌ను సందర్శించారు. సంతృప్తి వ్యక్తం చేసిన ప్రతినిధులు.. కొన్ని సూచనలు చేశారు.
Sangareddy Collectorate ISO Recognition: ఆయా శాఖల నిర్మాణం.. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది నుంచి సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వివరాలతో కూడిన బోర్డులు కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాల లక్ష్యాలు.. అందించే సేవల సమాచారంతో కూడిన సూచికలు ఏర్పాటు చేశారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకులు ఎలా వ్యవహరించాలి.. ఎలా ఉండకూడదో తెలిపే పట్టికల్ని ఏర్పాటుచేశారు.