దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు తమ పార్టీని నిరుత్సాహ పరచలేదని, పోలీసుల అత్యుత్సాహమే భాజపా గెలుపునకు దోహదమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆటు పోట్లు కాంగ్రెస్ కు కొత్తేమీ కాదన్న ఆయన... దుబ్బాకలో తమ పార్టీకి అభ్యర్థి లేకపోవడం తెరాస, భాజపాకు కలిసొచ్చినట్లు అభిప్రాయపడ్డారు.
గెలుపు, ఓటములను పక్కన పెడితే తమ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి భాజపా, తెరాస, ఎంఐఏం మూడు శత్రువులేనన్న జగ్గారెడ్డి... దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన భాజపా సాధారణ ఎన్నికల్లో గెలవలేదని జోస్యం చెప్పారు. తెరాసతో కలసి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నచ్చని వాళ్లే సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు.