మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డెగళూరు నుంచి హైదరాబాద్లోని ఓ పెళ్లికి హాజరయ్యేందుకు బయలు దేరింది ఓ బృందం. తుఫాన్ వాహనంలో బయలుదేరిన వీరు... మరి కొద్ది సమయంలో గమ్యస్థానం చేరుకుంటామనుకునే లోపే మృత్యువు లారీ రూపంలో వచ్చింది. సంగారెడ్డి జిల్లా, కల్హేర్ మండల పరిధిలోని బాచేపల్లి శివారు జాతీయ రహదారిపై ఢీకొట్టింది. ప్రమాదంలో తుఫాన్లోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా... 19 మంది గాయపడ్డారు. అందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.
మృతి చెందిన వారిలో వాహన చోదకుడు నాందేడ్ జిల్లా డెగళూర్కు చెందిన మన్నాన్, అదేవిధంగా పెళ్లి బృందానికి చెందిన 19 ఏళ్ల శివానిగా గుర్తించారు. గాయపడ్డ వారిలో లత, స్వాతి లాతూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంధ్య, అర్చన, రజిని, గుండప్ప, సత్యవతి, స్నేహ, పూజ, ప్రత్యక్ష, చిట్టి డేగళూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు నిర్ధరించారు. తుఫాన్ వాహనంలో ఉన్న సంధ్య, అశోక్, రజినిలు హైదరాబాద్కు చెందిన వారు. క్షతగాత్రులను నారాయణ్ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మరికొందరిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిట్టి అనే ఏడేళ్ల పాప ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.