రాష్ట్రంలో అకాల వర్షాలు విషాదాన్ని నింపాయి. పిడుగుపాటులకు వేర్వేరు చోట్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి నలుగురు దుర్మరణం చెందారు. మునిపల్లి మండలం మక్దూంపల్లిలో తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మాచగోని కృష్ణ, ప్రశాంత్‌గా గుర్తించారు. కంగ్టి మండలం తడ్కల్ వద్ద పిడుగుపాటుకు పశువుల కాపరి సురేశ్ మృతి చెందారు. పుల్కల్ మండలం పోచారంలో పిడుగు పడి మేకల కాపరి చంద్రయ్య ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లాలోనూ పిడుగులకు ఇద్దరు బలయ్యారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన ఓరుసు మల్లయ్య, అల్లేపు రవి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్నారు. వర్షం పడుతోందని పశువుల కొట్టంలో తలదాచుకున్నారు. కొట్టంపై పిడుగు పడటంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.
కన్నీరుమున్నీరవుతున్న రైతులు
మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. లక్షెట్టిపేట కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యంతోపాటు తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిచి పోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. సకాలంలో తూకం వేయకుండా, ధాన్యం తరలించకపోవడంతోనే ధాన్యం తడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు పరిధిలోని తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. తూకం కోసం తీసుకువచ్చిన ధాన్యం బస్తాల కింద వరదనీరు చేరింది. చేతికొచ్చిన మామిడి కాయలు పెద్దఎత్తున నేలరాలాయి. ఈదురుగాలులతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈదురుగాలుల బీభత్సం