ఒక సర్వీసు కనెక్షన్ విద్యుత్తు బిల్లు బకాయి ఉందని కాలనీ మొత్తానికి కరెంట్ బంద్ చేసిన ఉదంతమిది. తమకు సంబంధం లేని బిల్లు విషయంలో... ఎలాంటి బకాయిలు లేని 422 విల్లాలకు ఐదు గంటలపాటు కరెంట్ సరఫరా నిలిపేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ నిలిపేయడంపై సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి పటేల్‌గూడలోని ప్రణీత్ ప్రణవ్ కౌంటీ సంక్షేమ సంఘం ఎర్రగడ్డలోని విద్యుత్తు వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్-1)కి ఫిర్యాదు చేసింది.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
పటేల్‌గూడ పరిధిలోని మా కాలనీలో 422 విల్లాలు ఉన్నాయి. ప్రతినెలా ఎవరి విల్లా బిల్లులు వారు క్రమం తప్పక చెల్లిస్తున్నారు. కామన్ అవసరాల బిల్లు సైతం చెల్లిస్తున్నాం. కానీ శుక్రవారం విద్యుత్తు లైన్‌మెన్ వచ్చి ఒక సర్వీస్ నెంబరు చూపించి రూ.24వేల బకాయి ఉందని.. వెంటనే కట్టకపోతే అందరికి కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించి వెళ్లాడు. ఆ సర్వీసు వివరాల గురించి ఆరా తీస్తే.. 2017 వరకే అది వినియోగంలో ఉంది. ఆ తర్వాత నుంచి ఆ కనెక్షనే లేదు. ఇన్నాళ్లు పట్టించుకోని సిబ్బంది ఒక రోజు సమయం ఇచ్చి కట్టమని చెబితే.. ఆ సర్వీసు నెంబరు ఎవరిదో తెలియకుండా ఎలా చెల్లిస్తామని.. కొంత సమయం ఇవ్వమని కోరాము. అయినా వినకుండా ఏఈ సూచనల మేరకు సిబ్బంది కరెంట్ సరఫరా తీసేశారు. కాలనీలోని 422 విల్లాల కరెంట్ సరఫరా నిలిపేశారు. మధ్యాహ్నం 1 గంటకు తీసేసి సాయంత్రం 6 గంటలకు పునరుద్ధరించారు. ఐదు గంటల పాటు తీవ్ర ఇబ్బందులపాలయ్యాం. ఏఈ మణికంఠ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని సీజీఆర్‌ఎఫ్-1కు ఫిర్యాదు చేశాం. -సత్తయ్య, ప్రణీత్ ప్రణవ్ కౌంటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఇదీ చదవండి:సమయానికి రమ్మన్నారని.. ప్రధానోపాధ్యాయురాలిపై దాడి