విద్యార్థులు గుమిగూడారు. నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యపై చర్చిస్తున్నారు. వీరికి బంధువులు తోడయ్యారు. హైదరాబాద్లోని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రి లోపల ఏం జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు. అందరితోనూ కలివిడిగా, ఆనందంగా ఉండే ఆ విద్యార్థిని ఎందుకు చనిపోయిందో అంతుపట్టడం లేదు. అందరూ కలిసి మార్చురీ లోపలికి చొచ్చుకెళ్లారు. విద్యార్థిని మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఈక్రమంలో విద్యార్థి నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టే పనిలో పడ్డారు. అంతలోనే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు శవం మీద పడి రోదిస్తున్నారు. పోలీసులు వారిపైనా దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థిని తండ్రిని ఓ పోలీసు బూటుకాలితో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు.