తెలంగాణ

telangana

ETV Bharat / state

విపణి లేక... విక్రయించలేక...! - Suffering of Pasupu crop Farmers

ఏ శుభకార్యం జరగాలన్నా పసుపు ఉండాల్సిందే. వంటల్లోనూ నిత్యం వినియోగిస్తాం. ఈ పంట సాగుచేసిన అన్నదాతలకు నష్టాలే మిగులుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌తో పండించిన దిగుబడులను విక్రయించే పరిస్థితిలేకుండా పోయింది. పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చేదారి తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

Pasupu crop farmers are suffering due to lock down
విపణి లేక... విక్రయించలేక...!

By

Published : May 18, 2020, 2:17 PM IST

సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‌, జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి, కోహీర్‌ మండలాల్లో 1,332 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. అత్యధికంగా కొండాపూర్‌ మండలంలో 552, జహీరాబాద్‌లో 197, న్యాల్‌కల్‌లో 156, మొగుడంపల్లిలో 147, కోహీర్‌లో 135 ఎకరాలు సాగుచేసినట్లు ఉద్యాన శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

సంచుల్లో నింపి...

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా విపణి కార్యకలాపాలు పూర్తిస్థాయిలో సాగడంలేదు. పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి. పసుపును సంచుల్లో నింపి ఇంట్లో నిల్వ ఉంచారు. అప్పులు చేసి పంటసాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు అప్పులకు వడ్డీ పెరుగుతుండగా మరోవైపు పెట్టుబడులు తిరిగి వస్తాయోలేదోనని ఆందోళన చెందుతున్నారు.

నిల్వ సదుపాయం లేదు

పసుపు ఉత్పత్తులను నిల్వ చేసేందుకు అవసరమైన సదుపాయాలు జిల్లాలో లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఎక్కువ రోజులు ఇంట్లో నిల్వ ఉంచే పరిస్థితి లేదు. దీంతో దళారులను ఆశ్రయించి ఎంతోకొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన శీతల గిడ్డంగులు ఉంటే ధర ఆశాజనకంగా విక్రయించేందుకు వీలుండేదని, అధికారులు ఇప్పటికైనా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి

గిట్టుబాటు ధర ఉంటుందన్న ఆశతో రెండు ఎకరాల్లో పసుపు సాగుచేశా. దిగుబడి అంతంతమాత్రంగా వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా విపణిలో కొనుగోళ్లు లేకపోవడంతో ఆరుగాలం శ్రమకు తగ్గ ఫలితం రావడంలేదు. ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇంట్లోనే నిల్వ ఉంచాం. ప్రభుత్వం స్పందించి నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details