కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత వైరస్ బాధితులనే కాదు ఆసుపత్రుల నిర్వాహకులను సైతం వేధించింది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రోజుల్లో ఎప్పుడు ఆక్సిజన్ నిల్వలు అయిపోతాయో..? ఎప్పుడు సరఫరా నిలిచిపోతుందో..? అన్న ఆందోళనతోనే ఆసుపత్రుల నిర్వాహుకులు సేవలు అందించారు. మూడో దశ కరోనా వస్తే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా జిల్లాలోని ఏడు ముఖ్య ఆసుపత్రుల్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రిలో ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఉండగా... దీనికి తోడు అదనంగా నిమిషానికి వెయ్యి లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పటాన్చెరు, జహీరాబాద్, జోగిపేటలోని ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు సదాశివపేట, మిర్జాపూర్‌లోని సీహెచ్సీల్లో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నారాయణఖేడ్‌లోనూ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు.
ఇప్పటికే జహీరాబాద్, పటాన్చెరు ఆసుపత్రుల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జహీరాబాద్ ఆసుపత్రికి యంత్రాలు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో నాగ్‌పూర్ నుంచి పటాన్‌చెరుకు సైతం యంత్రాలు రానున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, మిర్జాపూర్‌లో షెడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నారాయణఖేడ్, జోగిపేటలో స్థలం ఎంపిక పూర్తి కాగా.. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. విద్యుత్ అంతరాయంతో ఉత్పత్తిలో అటంకాలు తలెత్తకుండా ప్లాంట్లకు ప్రత్యేకంగా జనరేటర్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు అత్యవసర వినియోగం కోసం ప్రతి ఆసుపత్రిలో 25వేల లీటర్ల నుంచి 30వేల లీటర్ల ఆక్సిజన్‌ను డీటైప్ సిలిండర్లలో నిల్వ ఉంచుకోనున్నారు.