SSC EXAMS 2023 in Sangareddy: అందరి విద్యార్థులులాగానే వారు కూడా స్కూల్‌కి వెళ్లి పదో తరగతి పరీక్షలకు సన్నద్దం అయ్యారు. పరీక్షలు సమయం వచ్చిన వారికి ఆ పాఠశాల యాజమాన్యం హాల్‌టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారు ఎగ్జామ్స్ రాయలేదు. ప్రిన్సిపల్ మేడంని అడిగితే తరువాత పరీక్షకు ఇస్తామంటూ ఆ విద్యార్థిలకు నచ్చ చెప్పారు. చివరికి సగంపైగా పరీక్షలు అయిపోయిన వారికి పరీక్షలు రాసే అవకాశం రాలేదు. దీంతో ఆ విద్యార్థులు పోలీసులను సంప్రదించారు. విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
జహీరాబాద్ ఎస్ఐ శ్రీకాంత్, బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం పదో తరగతి నిర్వహణకు అనుమతులు లేకుండా 8 మంది విద్యార్థులను అడ్మిషన్ చేసుకుంది. తీరా పరీక్ష ఫీజులు సహా పాఠశాల ఫీజులు సైతం దర్జాగా వసూలు చేసింది. వార్షిక పరీక్షలు ప్రారంభం కావస్తున్న రేపు మాపంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. సగానికి పైగా పరీక్షలు పూర్తయిన ఇంకా హాల్‌టికెట్లు ఇవ్వక పోవడంతో శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమతులు లేకున్న పదో తరగతి ప్రవేశాలు తీసుకోవడం పట్ల పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపల్ ఇందిరను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
మాకు హాల్‌టికెట్లు కావాలి: విద్యార్థులకు జరిగిన నష్టంపై విద్యాధికారి బసవరాజు తనకు ఏమీ తెలియదన్నట్టు సమాధానం ఇవ్వడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఏ పాఠశాలకు అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్న విద్యాధికారే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎనిమిది మంది పిల్లల భవిష్యత్తు నాశనమయ్యేలా చేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విద్యాశాఖ తమకు హాల్‌టికెట్లు అందించి పరీక్షలు రాసేలా అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.