Open To All Teaching Programme IN IIT Hyderabad : జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలో విజయం సాధించి సీటు పొందిన వారికే ఐఐటీ పాఠాలు వినే అవకాశం ఉంటుంది. తాజాగా ప్రపంచంలోని ఎవరైనా, ఎక్కడనుంచైనా క్లాసులు వినే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అనేక ఐఐటీలు ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించి.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందరికి చేరువ చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కోర్సులు ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్.. ఈ దిశగా మరింత క్రియాశీలక ప్రయత్నం మొదలుపెట్టింది. "ఓపెన్ టు ఆల్ టీచింగ్" పేరుతో ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
తరగతి గదులను ఆధునీకరించిన ఐఐటీ హైదరాబాద్ వచ్చే సెమిస్టర్ నుంచి క్లాసులను.. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనుంది. దీని వల్ల తరగతి గదిలోని విద్యార్థులకు ఆచార్యులు చెప్పే పాఠాలను.. ప్రత్యక్ష ప్రసారంలో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా వినే సదుపాయం కలుగుతుంది. దీనితో పాటు సదరు ఆచార్యులతో లైవ్‌లోనే సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం సైతం ఉంటుంది. అలాగే మారుతున్న విద్యా విధానానికి ఆధునికంగా నాంది పలికినట్లు అవుతుంది.
"ఐఐటీ హైదరాబాద్లోని తరగతులను ఆధునీకరించాం. విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఐఐటీ పాఠాలను వినేందుకు అవకాశం ఉంది. ఈ పాఠాలను ఆచార్యులు ఆన్లైన్లో చెబుతారు. ఐఐటీలో అన్ని కోర్సులను హైబ్రిడ్ రూపంలో అందిస్తున్నాం. అందుకు సంబంధించిన విషయాలను వెబ్సైట్లో పొందుపరిచాం. కోర్సు మొత్తం పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ను అందించనున్నాం."- బీఎస్ మూర్తి, ఐఐటీ హెచ్ డైరెక్టర్