ప్రయాణికుల కోసం వాడుకలో లేని ఓ బస్సే షెల్టర్‌గా మారింది. ఎండకు ఇబ్బందులు పడుతోన్న ప్రయాణికుల బాధలు చూడలేక సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ డిపో మేనేజర్.. వారి సౌకర్యార్థం ఆర్టీసీ బస్సును, బస్టాండుగా తయారు చేయించారు. రాజీవ్ కూడలిలోని ప్రయాణికులు.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ శ్రీరామచంద్రమూర్తి కోరుతున్నారు.
నాడు గమ్యస్థానాలకు చేర్చింది... నేడు నీడనిస్తోంది! - ఆర్టీసీ బస్సే బస్టాండ్
మనసుంటే మార్గముంటుందని నిరూపించాడు ఓ ఆర్టీసీ అధికారి. ఎండలో బస్సు కోసం పడిగాపులు కాసే వారికోసం వినూత్న ఆలోచన చేశాడు. వినియోగంలోలేని ఓ బస్సుని.. షెల్టర్‌గా మార్చి ప్రయాణికుల అభిమానాన్ని పొందాడు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్ పట్టణంలో ఇది జరిగింది.
హైదరాబాద్‌కు వెళ్లే ప్రతి బస్సు.. బస్టాండ్ నుంచి రాజీవ్ కూడలి వరకు వెళ్లి వస్తుంటుంది. చౌరస్తాలో బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు.. రోడ్లు, హోటళ్లు, ఇతర దుకాణాల ముందు నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. అసలే ఎండాకాలం కావడంతో రోడ్లపై నిలబడలేక ప్రజలు పడుతోన్న ఇబ్బందులను గమనించిన శ్రీరామచంద్రమూర్తి.. డిపోలో వినియోగంలోలేని ఓ పల్లె వెలుగు బస్సును... ప్రయాణికులు కూర్చునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద మనసుతో చేసిన మంచి పనికి.. స్థానికులంతా డిపో మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:రైతు బంధు, రైతు వేదికలు దేశానికే ఆదర్శం: ఇంద్రకరణ్