తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం... విలవిల్లాడుతూ వృద్ధుడు మృత్యువాత - sangareddy government hospital

కరోనా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధుడికి వైద్యుల నిర్లక్ష్యం యమపాశమైంది. నిపుణులైన వైద్య సిబ్బంది చేయాల్సిన పనిని సెక్యూరిటీ గార్డుతో చేపించి బాధితున్ని విలవిలలాడేలా చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఐదు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఆ మరుసటి రోజే ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

government hospital employees negligence
government hospital employees negligence

By

Published : Jun 12, 2021, 11:07 AM IST

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం... విలవిల్లాడుతూ వృద్ధుడు మృత్యువాత

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడికి మూత్ర సంచి సంబంధించిన గొట్టాన్ని సరిగా అమర్చక పోవడంతో.. రక్తస్రావమై.. విలవిలల్లాడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నిపుణులైన సిబ్బంది చేయాల్సిన పనిని కాపలాదారుతో చేయించడం వల్ల ఈ ఘటన సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం చండూరు గ్రామానికి చెందిన పోచయ్య (55) వారం రోజుల కిందట కరోనా బారిన పడ్డాడు. తొలుత సంగారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి అక్కడ డబ్బులు కట్టలేని స్థితిలో నాలుగు రోజుల క్రితం పోచయ్యను కుమారుడు మల్లేశం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈనెల 10న నీరసంతో వృద్ధుడు దుస్తుల్లోనే మూత్రం పోసుకుంటున్నాడు. తండ్రి పరిస్థితిని గమనించి మూత్రం సంచి పెట్టాలని అక్కడే ఉన్న నర్సును కుమారుడు కోరారు. సుమారు మూడు గంటలపాటు వార్డులో కనిపించిన వైద్య సిబ్బందినల్లా వేడుకున్నారు. చివరకు రాత్రి 7 గంటల తర్వాత కాపలాదారు వచ్చి మూత్రం సంచి, గొట్టం తెచ్చి వృద్ధుడికి అమర్చే యత్నం చేశాడు. పైపు సరిపోకపోవడంతో మరోటి తెచ్చాడు. అది కూడా మూత్రనాళంలోకి పెట్టరాక పోవటంతో కాపలాదారు గట్టిగా దూర్చాడు. పోచయ్య బాధతో అల్లాడిపోయాడు. తీవ్రస్థాయిలో అంగం నుంచి రక్తస్రావం మొదలైంది. ఇదేంటని అడిగినా ఏం ఫర్వాలేదు తగ్గుతుందంటూ చెప్పారు.

బయట నుంచి తెచ్చుకోండని సలహా

ఎంత సేపైనా సంచిలోకి మూత్రం రాకపోవడం.. పక్క నుంచి రక్తస్రావం కావడం గమనించి కుమారుడు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. మధ్యరాత్రి 12 గంటల సమయంలో వచ్చి తమ వద్ద పెద్ద పరిమాణంలో ఉందని.. కొంచెం చిన్న సైజుది కావాలని.. బయట నుంచి తెచ్చుకోమని సలహా ఇచ్చి సిబ్బంది వెళ్లిపోయారు. పక్క పడక మీద ఉన్న రోగుల సహాయకుల సహకారంతో మల్లేశం ఎట్టకేలకు ఆ సైజులో ఉన్న సంచి, గొట్టం తెప్పించారు. రక్తస్రావంతో 5 గంటల నరకయాతన అనుభవించిన పోచయ్యకు కాస్త ఉపశమనం దక్కింది. మరుసటి రోజు ఆయన పరిస్థితి విషమించిందని గమనించిన వైద్యులు వెంటిలేటర్‌ మీదకు చేర్చారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పర్యవేక్షకుడు డాక్టర్‌ సంగారెడ్డిని వివరణ కోరగా... తన దృష్టికి ఈ విషయం వచ్చిందని, విచారణ చేయిస్తామని చెప్పారు.

పట్టించుకునే వారు లేరు..

మా నాన్నను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాక దవడలు, ముఖం బాగా నొప్పిగా ఉన్నాయన్నారు. కనీసం నొప్పి తగ్గడానికి మాత్రలు అడిగినా మూడు రోజుల వరకు పట్టించుకోలేదు. ఈనెల 9న ఒక డాక్టర్‌ వచ్చి ఏవో మందులు రాసి వెళ్లారు. ఇంతలో నీరసపడి మూత్రం దుస్తుల్లో పోసుకుంటుండటంతో కాపలాదారుతో పెట్టించారు. నాన్న చాలా అవస్థ పడి చివరికి ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉంది. - మల్లేశం, పోచయ్య కుమారుడు


ఇదీ చూడండి: సెల్​ ఫోన్ల దొంగ.. సీసీ కెమెరాలో చిక్కాడు..!

ABOUT THE AUTHOR

...view details