తెలంగాణ

telangana

ETV Bharat / state

Underpass Bridge: అండర్‌పాస్‌ నిర్మాణంలో అలసత్వం... నరకప్రాయంగా ప్రయాణం - సంగారెడ్డి జిల్లా వార్తలు

రోడ్డు నిర్మాణంలో ప్రణాళికలోపం వాహనదారులకు సమస్యలను తెచ్చిపెట్టింది. ఇబ్బందులు తప్పించేలా పనులు చేపడితే... లేని కష్టాలను తెచ్చిపెట్టింది. కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందన్న చందంగా మారి... ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. సంగారెడ్డి పట్టణ శివారులోని జాతీయ రహదారిపై నిర్మిస్తున్న అండర్‌పాస్‌ పనుల్లో ఆలస్యం, గుత్తేదారుల అలసత్వంతో వాహనదారులు పడుతున్న కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...

Sangareddy Road Problems
Sangareddy Road Problems

By

Published : Oct 18, 2021, 3:39 PM IST

సంగారెడ్డి అండర్‌పాస్‌ నిర్మాణంలో నత్తనడకన సాగుతున్న పనులు

సంగారెడ్డి నుంచి కర్నాటక వరకు 65వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించారు. రోడ్డు నిర్మాణంలో ప్రణాళిక లోపం వల్ల సంగారెడ్డి శివారులోని మల్కాపూర్‌ చౌరస్తా వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొండాపూర్ మండలంలోని పలు గ్రామాలకు, పరిశ్రమలకు వెళ్లే వాహనాలతో పాటు.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వెళ్లే వాహనాలు సైతం ఇక్కడి నుంచే ప్రయాణిస్తాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించకపోవడంతో…స్థానికులు ఆందోళన చేపట్టి మరీ అండర్‌పాస్‌ మంజూరు చేయించుకున్నారు. నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. కానీ కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా... అండర్‌పాస్‌ పనులు మొదలైన నాటి నుంచి వాహనదార్ల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి.

అండర్ పాస్ నిర్మాణం మొదటి నుంచి నత్త నడకనే సాగుతోంది. గుత్తేదారు అలసత్వంతో వాహనదార్లకు ఇక్కట్లు తప్పడం లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డు చిన్నగా ఉండటంతో పాటు దారి పొడవునా కంకర తేలి గుంతలమయమైంది. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోడ్డు ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటి చిన్న వాహనాల వారికి అత్యంత ప్రమాదకరంగా మారింది. రోడ్డు కంకర తేలి ఉండటంతో పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు రాళ్లు ఎగిరి వచ్చి ఇతర వాహనదారులకు తగులుతున్నాయి. కళ్లలో దుమ్ము పడటం, గుంతల వల్ల అదుపు తప్పి కింద పడటం వంటివి ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. గత 3 ఏళ్లలో ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. ఇటీవల ఓ నవవధువు బస్సు ఢీకొని చనిపోయింది. ఇన్ని జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఈ చౌరస్తా కూరగాయలతో పాటు ఇతర వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు అడ్డా. అండర్ పాస్ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి వీరి వ్యాపారాలు దివాలా తీశాయి. వాహనాల రాకపోకల వల్ల వచ్చే దుమ్ము వీరి వస్తువులపై పడటంతో కోనుగులు దారులు రావడం లేదు. ఇక చౌరస్తా వెంబడి ఉన్న దుకాణాదారులు, ఇళ్ల పరిస్థితి కూడా ఇదే. దుమ్ము వల్ల ఉండలేక.. పోలేక నరకం అనుభవిస్తున్నారు. గుత్తేదారుపై చర్యలు తీసుకోవడంతో పాటు అండర్‌పాస్‌ పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

అండర్ పాస్ నిర్మాణం మొదటి నుంచి నత్త నడకనే సాగుతోంది. గుత్తేదారు అలసత్వంతో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నాము. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డు చిన్నగా ఉండటంతోపాటు దారి పొడవునా కంకర తేలి గుంతలమయమైంది. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. -ప్రశాంత్, వాహనదారుడు

ఈ రోడ్డు ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటి చిన్న వాహనదారులకు అత్యంత ప్రమాదకరంగా మారింది. రోడ్డుపై కంకర తేలి ఉండటంతో పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు రాళ్లు ఎగిరి వచ్చి ఇతర వాహనదారులకు తగులుతున్నాయి. కళ్లలో దుమ్ము పడటం, గుంతల వల్ల అదుపు తప్పి కింద పడటం వంటివి నిత్యం జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదు. -సురేశ్​ కుమార్, ఆటో డ్రైవర్

ఇదీ చదవండి:రైతన్న కష్టం.. బసవన్నపై భారం

ABOUT THE AUTHOR

...view details