సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పీచార్యాగడి గ్రామంలో మంచి సారవంతమైన పొలాలు ఉన్నాయి. ఇక్కడి రైతులు ఆహార పంటలతో పాటు చెరకు, అల్లం వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల వ్యవసాయ సంక్షేమ పథకాలు పొందే అర్హతలు వీరికి ఉన్నాయి. అయినా అవేవీ అమలు కావు. దీనికి కారణం అధికారులు చేసిన పొరపాటు. ఈ గ్రామంలోని భూములు వక్ఫ్ పరిధిలోకి వస్తాయని అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదిక వీరికి శాపమైంది.
తీవ్ర కష్టాల్లో అన్నదాతలు
పీచార్యాగడి గ్రామంలోని సర్వే నెంబర్ 50లో 2,181 ఎకరాల భూములున్నాయి. ఎన్నో ఏళ్లుగా రైతులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. క్రయవిక్రయాలూ సైతం సాగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు కొత్త పాసుపుస్తకాలూ అందించింది. ప్రారంభంలో మూడు సార్లు రైతు బంధు సాయమూ దక్కింది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఇవన్నీ వక్ఫ్ భూములేనంటూ 2,181 ఎకరాలను ఆ జాబితాలో చేర్చడంతో ఒక్కసారి పట్టాదారులంతా తీవ్ర కష్టాల్లో పడ్డారు.
నిలిచిపోయిన సంక్షేమ ఫలాలు
ఈ భూములను వక్ఫ్ జాబితాలో చేర్చడంతో రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. రైతుబంధు, రైతుబీమాతో పాటు పంటరుణాలు కూడా వీరికి అందడం లేదు. రైతుబంధు రూపంలో ఈ రైతులు ప్రతి సంవత్సరం 2కోట్ల 18లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఇటీవలి కాలంలో ముగ్గురు రైతులు చనిపోయారు. రైతుబీమా రక్షణ కూడా వీరికి లేకుండా పోయింది. ఏదైనా అత్యవసరానికి భూమి అమ్ముకునే అధికారం కూడా వీరికి లేదు.