Mother Fight for Adopted Son : దత్తపుత్రుడిని రక్షించుకునేందుకు ఓ తల్లి న్యాయపోరాటం చేస్తోంది. పద్నాలుగు ఏళ్ల క్రితం బాబును ఓ మహిళ వద్ద ఆ దంపతులు దత్తత తీసుకున్నారు. కన్నకొడుకును మరిచిపోయిన ఆ కన్నతల్లి... ఇన్నేళ్ల తర్వాత తన బాబు తనకు కావాలని ఒత్తిడి చేస్తోంది. తన బిడ్డను తనకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని చైల్డ్ వెల్ఫేర్ అధికారులపై ఒత్తిడి పెంచడంతో... వారు పెంచిన తల్లిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఓవైపు తన బిడ్డను కన్న తల్లి.. మరోవైపు అధికారుల వేధింపులు భరించలేక.. తన కుమారుణ్ని దూరం చేసుకోలేక వారిపై పోరాటానికి దిగింది ఆ పెంచిన తల్లి. వారి నుంచి తన బిడ్డను దక్కించుకోవడానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.
Mother Fight for Adopted Son in Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకి చెందిన రాజేశ్, రమణమ్మ దంపతులు. వారికి సంతానం లేకపోవడంతో 2009లో అదే ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ వద్ద రెండు నెలల వయసున్న బాబు అఖిల్‌ను దత్తత తీసుకున్నారు. శారద అనే మహిళ కొండల్ నాయక్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. వారికి వివాహం కాకముందే బాబు పుట్టడంతో.. ఆ పసికందును వదిలించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి రాజేశ్, రమణమ్మ దంపతులు ఆ పసిబిడ్డను తమకు ఇవ్వాలని.. దత్తత తీసుకుంటామని కోరారు. దీనికి అంగీకరించిన శారద.. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో అఖిల్‌ను దత్తత ఇచ్చింది. కొంత కాలం తర్వాత శారద కొండల్ నాయక్‌ను వివాహం చేసుకుంది.
"నా కళ్ల ముందే నా కొడుకుని బలవంతంగా లాక్కెళ్లారు. ఒక్కడినే ఒక గదిలో ఉంచారు. కనీసం తనను చూద్దామంటే ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. నా బాబు చాలా ఏడుస్తున్నాడు. వాణ్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. అమ్మా.. నేను ఎక్కడికి వెళ్లను.. నీ దగ్గరే ఉంటా అని వాడు గుండెపగిలేలా ఏడుస్తున్నాడు. వాడి బాధ చూసైనా అధికారులకు కనికరం కలగడం లేదు. కనీసం వాడిని చూడటానికి అనుమతి కూడా ఇవ్వడం లేదు."
- రమణమ్మ, అఖిల్‌ను పెంచిన తల్లి