ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ధరలు వసూలు చేయకుండా బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కరోనా నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై సంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనాతో చికిత్స పొందుతున్న వారికి పౌష్టికాహారం అందించేందుకు ప్రతి రోజు 250 రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి: హరీశ్ రావు - సంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి జిల్లాలో కరోనా చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్థికమంత్రి హరీశ్ రావు తెలిపారు. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్య శాఖకు సంబంధించి బిల్లులు తక్షణం ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్టింగ్ కిట్లు, టీకాలు, పడకలు, వెంటిలేటర్లు, మందులు అందుబాటులో ఉంచామని వివరించారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ నిల్వలు సమకూర్చుకోవడంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు కావాల్సిన వసతులు కల్పించి వైద్య సేవలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ప్రజలు కరోనా గురించి ఆందోళనకు గురి కావద్దని హరీశ్ రావు సూచించారు.