రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీరు అందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్థిక మంత్రి హరీశ్ రావు... బోరంచలో ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.
పొలం పొలంకి నీళ్లందిస్తాం..
70 ఏళ్ల సమైఖ్య పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చుక్క నీరు తేలేదని హరీశ్ రావు విమర్శించారు. గుక్కెడు మంచి నీళ్లు వస్తే చాలనుకున్న నారాయణఖేడ్‌కు తాము తాగు నీరు, రోడ్లు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతులను తీసుకువచ్చామన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సాగు నీరు తీసుకువస్తామని.. చెరువులు, కుంటలు, వాగులు అన్ని నింపుతామని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా నారాయణఖేడ్, అందోలో నియోజకవర్గాల పరిధిలోని 1.65లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. రైతులు వాన కోసం ఆకాశం వైపు చూడాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు.