Minister Harish Rao Spiritual Meating in Sangareddy :రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పార్టీలన్నీ.. సభలూ, సమావేశాలతో మరింత దూకుడు పెంచాయి. తెలంగాణ వ్యతిరేకులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దోస్తానా చేస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాకుండా కుట్రలు చేసిన వారందరూ ఒక్కటయ్యారన్నారు. అసలైన తెలంగాణ వ్యతిరేకి.. రేవంత్ రెడ్డి కాదా.. అని ప్రశ్నలు సంధించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్ వైపు ఉండాలి.. తెలంగాణ ఓడాలంటే రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ వైపు నిలవాలని హరీశ్‌రావు అన్నారు. రేవంత్(Revanth Reddy) ఎలాంటి వాడో గురువారం గాంధీ భవన్‌లో చూశామన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చింది ఎవరో చూశామని.. ఉస్మానియా విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరని.. క్రిమినల్ ఎవరో.. ఆ మైండ్ సెట్ ఎవరిదో అందరికీ తెలుసని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసి కర్ణాటక ప్రజలు ఏవిధంగా మోసపోయారో.. ఇటీవల ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Sivakumar) మాటల్లోనే స్పష్టమైందన్నారు.
తెలంగాణ రావటం ఇష్టంలేని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో బీజేపీ వాళ్లు చేతులు కలుపుతున్నారు. వంద కోట్ల మంది ఒప్పుకుంటేనే తెలంగాణ అని పలికిన.. తెలంగాణ రావడం నేను బతికుండగా కానే కాదన్న రాజశేఖర్ రెడ్డి, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ షర్మిళ ఇవాళ కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నారు. లోపలకెళ్లి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఉంటారట. ఓట్లు చీలకూడదని తెలంగాణలో పోటీ చేయనంటారు. వీటన్నింటిని చూస్తుంటే తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవవుతున్నారని అర్థమౌతోంది. మన రాష్ట్రాన్ని ఆగం చేయటానికి ద్రోహులంతా కాంగ్రెస్, బీజేపీ ముసుగులో వస్తున్నారు. మనమంతా జాగ్రత్తగా ఉండాలి.-హరీశ్‌రావు, ఆరోగ్యశాఖ మంత్రి