తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్చి 31లోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు అమలు: హరీశ్​ రావు - review on dalit bandhu

Harish Rao On Dalit Bandhu: సంగారెడ్డిలో దళిత బంధు పథకంపై ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. మార్చి 31 లోపు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులకు దళిత బంధు అమలు చేస్తామని హరీశ్​ అన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలని సూచించారు.

Harish Rao On Dalit Bandhu
దళిత బంధు పథకం అమలు

By

Published : Jan 23, 2022, 2:57 PM IST

Harish Rao On Dalit Bandhu: మార్చి 31 లోపు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులకు దళిత బంధు అమలు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు సంగారెడ్డిలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రి హరీశ్​ రావు సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి నిధులు మంజూరు చేశామని హరీశ్​ తెలిపారు. కలెక్టర్ ఖాతాలో నిధులు జమ చేశామన్న మంత్రి... ఏ గ్రామాన్ని ఎంపిక చేయాలన్నది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఒకట్రెండు గ్రామాలను ఎంపిక చేయొచ్చని.. అధికారులు గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని వివరించారు. ఫిబ్రవరి తొలి వారంలోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తికావాలని ఆదేశించారు. మార్చి మొదటి వారంలోగా యూనిట్లను గ్రౌండ్ చేయాలని సూచించారు.

అధికారులు గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి తొలి వారంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తికావాలి. మార్చి మొదటి వారంలోగా యూనిట్లను గ్రౌండ్ చేయాలి. మార్చి 31 లోగా ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేస్తాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. దళితబంధుపై ప్రతిపక్షాల నాయకులు అనేక రకాల విమర్శలు చేశారు. ఎన్నికలు ఉంటేనే పథకాలు గుర్తొస్తాయని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు లేవు.. సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ నెరవేర్చుతారు. --- హరీశ్ రావు​, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

ఇచ్చిన మాట ప్రకారం

దళితబంధు అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశామని హరీశ్​ అన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని.. అత్యంత పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధును అమలు చేస్తున్నామని.. ప్రజలకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారని హరీశ్​ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధును అమలు చేస్తున్నారని చెప్పారు.

విమర్శలు తగదు

2 నెలల సమయమే ఉన్నందున ప్రయోగాత్మకంగా ఒకట్రెండు గ్రామాల్లో అమలు చేస్తున్నామని.. వచ్చే బడ్జెట్‌లో దళిత బంధుకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తామని హరీశ్​ వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దళిత బంధును విస్తృతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళిత బంధుపై రకరకాల రాజకీయ విమర్శలు చేశారని.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు కూడా లేవని చెప్పారు. భాజపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఆందోళన వద్దు

Fever survey in Telangana: అంతకుముందుగా జిల్లాలో జరుగుతున్న ఫీవర్​ సర్వేను మంత్రి హరీశ్​ పరీశీలించారు. భారతినగర్ డివిజన్‌లో మంత్రి ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు. కరోనా చికిత్స కోసం రాష్ట్రంలో 56 వేల పడకలు అందుబాటులో ఉంచామని తెలిపారు. రెండు రోజుల్లో 29 లక్షల 20 వేల కుటుంబాలను సర్వే చేసినట్లు వివరించారు. లక్ష మందికి పైగా వ్యాధి లక్షణాలు ఉన్నవారికి కిట్లను అందించినట్లు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. గర్భిణీలకు సైతం అన్ని జిల్లాల్లో ఉన్న ఆస్పత్రుల్లో వసతులు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆదివారం అయినప్పటికీ వైద్య ఆరోగ్య సిబ్బంది ఫీవర్ సర్వే కోసం కష్టపడుతున్న విధానాన్ని మంత్రి కొనియాడారు. మరో నాలుగు రోజుల్లో ఈ ఫీవర్ సర్వే 100 శాతం పూర్తిచేస్తామని తెలిపారు.

పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక: హరీశ్‌రావు

ఇదీ చదవండి:Harish Rao Allegations on BJP: ఉద్యోగులపై భాజపాది కపట ప్రేమ : హరీశ్

ABOUT THE AUTHOR

...view details