వ్యవసాయ రంగానికి మేలు చేయడంతో పాటు సాగును లాభసాటిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఆర్థికమంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డిలో నియంత్రిత వ్యవసాయసాగు విధానంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సుకు హజరైన ఆయన.. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు.
'వానాకాలంలో పంట మార్పిడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం' రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని... వారు ఆత్మగౌరవంతో బతికేలా ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. వానాకాలంలో పంటమార్పిడి చేద్దామని రైతులకు పిలుపునిచ్చిన ఆయన... యాసంగిలో మక్కలు, ఇతర పంటలు వేసుకుందామని సూచించారు.
ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలో 3.60లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యమని మంత్రి అన్నారు. వచ్చే సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో వానాకాలంలో 25 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేయాలని సూచించారు. మక్కలకు ప్రత్యామ్నాయంపై రైతులు ఆలోచించాలని చెప్పారు.
కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా.. మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు. ఒకే పంట వేస్తే భూమిలో సారం తగ్గుతున్నందున పంటలు మార్చాలని కోరారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా ఎరువులు తెప్పించామని తెలిపారు. రైతులు ఎరువులు తక్కువగా వినియోగించాలని చెప్పారు. రైతు బంధు వేదికల నిర్మాణం 4 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:కరోనా నుంచి కోలుకున్న తర్వాత మెడనొప్పి!