తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రంలో భాజపాను గద్దె దింపితేనే ధరలు అదుపులోకి వస్తాయి'

Harish Rao Comments: అబద్ధాలు చెప్పయినా అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు ఆరోపించారు. తెరాస ప్రభుత్వం పంచుకుంటూ పోతుంటే.. భాజపా పెంచుకుంటూ పోతోందని ఆయన ఎద్దేవా చేశారు. భాజపా వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యికి పెంచారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపాను గద్దె దింపితేనే ధరలు అదుపులోకి వస్తాయని మంత్రి అన్నారు.

By

Published : Apr 17, 2022, 4:32 PM IST

Updated : Apr 17, 2022, 5:18 PM IST

Harish Rao Comments: 'కేంద్రంలోని భాజపాను గద్దె దింపితేనే ధరలు అదుపులోకి వస్తాయి'
Harish Rao Comments: 'కేంద్రంలోని భాజపాను గద్దె దింపితేనే ధరలు అదుపులోకి వస్తాయి'

Harish Rao Comments: తెరాస ప్రజలకు పంచుకుంటూ పోతూ ఉంటే.. భాజపా పెంచుకుంటూ పోతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. భాజపా వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యికి పెంచారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో అభయ హస్తం నిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్​ రావులు కేంద్రంపై మండిపడ్డారు. కేంద్రంలోని భాజపాను గద్దె దింపితేనే ధరలు అదుపులోకి వస్తాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. కేసీఆర్ పాలన చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు యాత్రలు చేస్తున్నాయన్నారు. అబద్ధాలు చెప్పయినా అధికారంలోకి రావాలని భాజపా యత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

వడ్డీ లేని రుణం ఇస్తాం..అభయహస్తం కింద మహిళా గ్రూపులకు రూ.5 వేల కోట్లు తిరిగి ఇచ్చే కార్యక్రమం చేపట్టామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. 50 ఏళ్లు నిండిన వారికి రూ.2016 పింఛను మంజూరు చేస్తామన్నారు. మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణం ఇస్తామని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.672 కోట్లు బ్యాంకు లింకేజీ ఇచ్చామన్న మంత్రి.. మహిళలకు తక్కువ వడ్డీకి డీసీసీబీ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు ముందుకు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తోందన్న ఆయన.. సర్కారు అమలు చేస్తున్న పథకాలను మహిళలకు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 శాతమే ఆపరేషన్ ద్వారా ప్రసవాలు జరుగుతుండగా.. మన రాష్ట్రంలో ఇది 60శాతం ఉందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ల వల్ల తల్లిబిడ్డలు ఇద్దరికీ అనర్థమేనని ఆయన వివరించారు. ప్రసవం కోసం ఆపరేషన్ చేయాలని వైద్యుల మీద ఒత్తిడి తేవొద్దని హరీశ్ రావు మహిళలకు సూచించారు.

భాజపాకు బుద్ధి చెప్పాలి.. అనంతరం మెదక్ జిల్లా హసన్​ మహమూద్​పల్లి గ్రామంలో దళితబంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు.. ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం చెయ్యని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఈ 6 సంవత్సరాల్లో తాము చేసి చూపించామన్నారు. భాజపా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవని ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1050కు పెంచి.. పెట్రోల్​, డీజిల్ ధరలు పెంచి.. ఏ ముఖంతో పాదయాత్ర చేస్తారని భాజపా నాయకులను ప్రశ్నించారు. పక్కనే భాజపా అధికారంలో ఉన్న కర్ణాటకలో 24గంటల విద్యుత్ లేదని.. 2వేల రూపాయల పింఛన్​ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా భాజపాకు గట్టి బుద్ధి చెప్పాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

భాజపా పెంచుకుంటూ పోతోంది..తెరాస అధికారంలోకి వచ్చాక మహిళల ఆత్మగౌరవం పెరిగింది. రాష్ట్రంలో 50 మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలు వచ్చాయి. పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సాయం అందిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం రాగానే పింఛన్‌ రూ.1000కి పెంచారు. రెండోసారి అధికారంలోకి రాగానే రూ.2000కు పెంచారు. త్వరలో 10 లక్షల మందికి కొత్తగా పింఛన్‌ ఇవ్వబోతున్నాం. 50 మహిళా గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు పెంచాం. అబద్ధాలు చెప్పయినా అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నాలు చేస్తోంది. భాజపా వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యికి పెంచారు. తెరాస ప్రభుత్వం పంచుతుంటే.. భాజపా పెంచుతుంది. -హరీశ్‌ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి..కేసీఆర్​ను అన్నగా.. తండ్రిగా ప్రతి మహిళ తమ గుండెల్లో పెట్టుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 30సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ సీఎం ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళా సాధికారికతకు బాటలు వేశారని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వారి ఆర్థిక స్వాలంభనకు కృషి చేశారని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2 వేలు పింఛను ఇస్తున్నామన్నారు. స్త్రీనిధి కింద రుణం తీసుకున్న మహిళ చనిపోతే మాఫీ చేస్తున్నామని ఆయన చెప్పారు. చనిపోయిన మహిళ చెల్లించిన సొమ్ము ఆ కుటుంబానికే తిరిగి ఇస్తామన్నారు. స్త్రీనిధిని ఆసరాగా చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

'కేంద్రంలోని భాజపాను గద్దె దింపితేనే ధరలు అదుపులోకి వస్తాయి'

ఇవీ చదవండి:

Last Updated : Apr 17, 2022, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details