బల్దియా ఎన్నికల్లో పటాన్చెరు బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. పక్కా ప్రణాళికలతో, ప్రచార వ్యూహాలతో పటాన్చెరులో గులాబీ జెండా ఎగిరేలా కృషి చేశారు. సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో భారీ మెజార్టీతో కారును పరుగుపెట్టించారు.
3 డివిజన్లలో కారు జోరు
దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు వచ్చిన రెండోరోజు నుంచే పార్టీ కేడర్‌ను గ్రేటర్ ఎన్నికకు సమాయత్తం చేశారు. దుబ్బాక విజయాన్ని ప్రభావితం చేసిన అంశాలను గుర్తించి.. వాటిని అధిగమించి గెలుపు పగ్గాలు చేపట్టేలా.. తనదైన శైలిలో ప్రచార వ్యూహాలు రచించారు హరీశ్ రావు. నియోజకవర్గాల వారీగా డివిజన్ల బాధ్యతలను ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలకు అప్పగించారు. టికెట్ ఆశించి రెబెల్స్‌గా మారిన వారిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారు. అంతర్గత అసంతృప్తులను చల్లబరిచి.. సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తూ గెలుపునకు బాటలు వేశారు.
క్షేత్రస్థాయిలో ప్రచారం
క్షేత్రస్థాయిలోనూ ప్రత్యేక ఇంఛార్జ్‌లను నియమించిన మంత్రి హరీశ్.. ఐదేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాబోయే రోజుల్లో చేయబోయే పనులను ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి డివిజన్లో రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ ప్రచారంలో గత ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హమీలు, పరిష్కరించిన వాటి గురించి ఏకరవు పెట్టారు. కేంద్ర సంస్థల ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తి బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ వంటి సంస్థల ఉద్యోగులను తమ వైపుకు తిప్పుకున్నారు.
కూల్చే వాళ్లా.. అభివృద్ధి చేసే వాళ్లా
సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలు, యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారు మంత్రి హరీశ్ రావు. భాజపా, ఎంఐఎంల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని, పరిణామాలనూ హరీశ్ రావు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. కూల్చే వాళ్లు కావాలా.. అభివృద్ధి చేసే వాళ్లు కావాలో తేల్చుకోవాలని ఓటర్లను ఆలోచింప చేశారు. వీటన్నింటి ఫలితంగా భారీ మెజార్టీతో పటాన్‌చెరులోని మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.