Migration effect on children education: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం పేరు చెప్పగానే.. వలసలు గుర్తుకువస్తాయి. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో ఇక్కడి నుంచి గిరిజనులు చెరుకు నరికేందుకు సంగారెడ్డి, ఆంధోల్ జహీరాబాద్ నియోజకవర్గాల్లోని గ్రామాలకు వెళ్తారు. తోటల పక్కనే తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటుచేసుకొని.. మార్చి నెల వరకు అక్కడే ఉండి పనులు చేసుకుంటారు. ఊళ్లో పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేక బడి మానిపించి వాళ్లనూ తమతో తీసుకెళ్తారు. దీంతో ఖేడ్ ప్రాంతంలో సర్కారీ బడుల్లోని విద్యార్థుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతోంది.
సిర్గాపూర్ మండలం రూప్ల తండా ప్రాథమిక పాఠశాల. ఇక్కడి నుంచి 8 మంది పిల్లలు కుటుంబంతో కలిసి వలస వెళ్లారు. వాళ్లు తిరిగి మార్చిలో వెనక్కి వస్తారు. ఈలోగా అంతకు ముందు నేర్చుకున్న పాఠాలు మర్చిపోతారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబరు, జనవరి రాగానే ఇక్కడి పేదలు.. పనుల కోసం వేరే ప్రాంతాలకు వలసవెళ్తారు. దీంతో వారి పిల్లలు కూడా తల్లిదండ్రుల వెంబడి వెళ్లాల్సి వస్తోంది. మళ్లీ మార్చిలో వస్తారు. ఈ క్రమంలో ఈ 5 నెలల్లో నేర్చుకున్నది మొత్తం వారు మరిచిపోతున్నారు. అష్రఫ్ అలీ, ఉపాధ్యాయుడు, రూప్లతండా
సగం మంది వలసబాట
ఇదొక్కటే కాదు.. సీతారాంతండా బడిలో 50 మంది పిల్లల్లో వలస వెళ్లిన వారు పోగా.. 25 మంది మాత్రమే వస్తున్నారు. కంగ్టి మండలంలోని రాంతీర్త్, చుక్కల్ తీర్త్, రాజారాం తండా, నాగల్గిద్ద మండలంలోని శాంతి నగర్ తండాల్లోని బడుల్లోనూ సగం మంది విద్యార్థులు వలస వెళ్లినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సాధు శంకర్ తండాలో 26 మంది పిల్లలకు గానూ... తల్లిదండ్రులతో అందరూ వలసబాటపట్టడంతో ఏకంగా బడినే మూసేశారు. ఇక్కడ పని చేసే టీచర్‌ని వేరే చోటుకు పంపించారు.
స్కూల్లో మొత్తం 90 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులు చెరుకు పనుల కోసం వలస వెళ్లే క్రమంలో పిల్లలను కూడా తీసుకెళ్తున్నారు. దీంతో ఈ సమయంలో విద్యార్థుల సంఖ్య 50, 60 మాత్రమే ఉంటోంది. వలసల ప్రభావం పిల్లల చదువులపై తీవ్రంగా పడుతోంది. సరస్వతీ, ఉపాధ్యాయురాలు, రాజారాం తండా