తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ దందా: పేర్లు ఇరికించారు.. పత్రాలు చించేశారు! - మెదక్​ జిల్లా భూకబ్జాల్లో ప్రజాప్రతినిధులు

ఉమ్మడి మెదక్‌ జిల్లా భూ అక్రమాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఖాజీపల్లి భూముల వ్యవహారంలోనూ పాత తేదీలు, ఫోర్జరీ సంతకాలతో దందా మొదలుపెట్టి పహాణీల్లో పేర్లను ఇరికించినట్లు తేలింది. ఇందులో కీలక భాగస్వామి అయిన ఒక అధికారి కిష్టాయపల్లి, ధర్మారం గ్రామాల్లో సాగిన భూదందాల్లో ప్రధాన పాత్ర పోషించారు.

many illegal land occupation in medak district are coming out in investigation
పేర్లు ఇరికించారు.. పత్రాలు చించేశారు! అక్రమార్కుల దందా తీరిది

By

Published : Sep 19, 2020, 6:05 AM IST

ఉమ్మడి మెదక్‌ జిల్లా భూ అక్రమాల్లో తవ్వేకొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఖాజీపల్లి భూముల వ్యవహారంలోనూ పాత తేదీలు, ఫోర్జరీ సంతకాలతో దందా మొదలుపెట్టి పహాణీల్లో పేర్లను ఇరికించినట్లు తేలింది. 2007 నుంచి 2013 వరకున్న రికార్డుల్లో పేర్లను రాసేశారు.

ఎన్‌వోసీ రావడానికి ముందే మాజీ సైనికోద్యోగులు భూములు అమ్మేందుకు ఇతరులతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆ ఇతరుల్లో ఓ ప్రజాప్రతినిధి కూడా ఉండటం గమనార్హం. ఈ అక్రమంలో ఆర్డీవో, తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు పడగా... మరో ఆరుగురిపై చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే.

ఇందులో కీలక భాగస్వామి అయిన ఒక అధికారి కిష్టాయపల్లి, ధర్మారం గ్రామాల్లో సాగిన భూదందాల్లో ప్రధాన పాత్ర పోషించారు. కొల్లూరు, ఉస్మాన్‌నగర్‌ వ్యవహారాల్లోనూ సహాయ సహకారాలు అందించారు. పేర్లు ఇరికించి రాయడం, ఉర్దూ రాతలకు తప్పుడు అనువాదాలు సృష్టించడం, పాత తేదీలతో బురిడీ కొట్టించడం, కీలక ఆధారాలైన రికార్డులను మాయం చేయడం లాంటి పద్ధతులను అనుసరించారు.

  • జిన్నారం మండలం కిష్టాయపల్లిలోని 166 సర్వే నంబరులోని 327.16 ఎకరాల ప్రభుత్వ భూమిలో దాదాపు 150 ఎకరాలు పేదలకిచ్చారు. ప్రభుత్వం ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోబోతుందని భయపెట్టి 2013లో ఓ అధికారి అండతో స్థానిక నేత ఈ భూముల్లో దాదాపు 70 ఎకరాలు కొన్నారు. అమ్మేది లేదని మొండికేసిన వారిని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత అవన్నీ పట్టాభూములేనంటూ రికార్డుల్లో మార్పులు చేశారు. రిజిస్ట్రేషన్లు జరిగేలా చూశారు.
  • నర్సాపూర్‌ మండలం ధర్మారంలో ఏకంగా నకిలీ సాదాబైనామాలను సృష్టించారు. నలుగురు అమాయక వృద్ధులను పట్టుకొని కథ నడిపించారు. 69 ఎకరాలను కొట్టేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించారు. లక్ష్మయ్య, సీతయ్య అనే వ్యక్తుల నుంచి ఆ నలుగురు సాదాబైనామా కింద భూమి కొన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు.
  • 2013-14 మధ్యకాలంలో కొల్లూరులోని ప్రభుత్వ భూమిలో 35 ఎకరాలను పట్టాగా మార్చేశారు. అవి ప్రభుత్వ భూములేనని చెప్పే ఆధారాలను రికార్డుల్లో నుంచి చించేశారు. ఆ తర్వాత పహాణీల్లో పేర్లను ఇరికించి రాశారు.
  • కొల్లూరు, ఉస్మాన్‌నగర్‌లలో ఒక అధికారి చేసిన అక్రమాలు నిగ్గుతేల్చేలా, గతంలో ఉమ్మడి జిల్లా సంయుక్త పాలనాధికారి ఆరునెలలపాటు అన్ని రికార్డులను పరిశీలించేలా ప్రత్యేక కసరత్తు చేశారు. అవి ప్రభుత్వ భూములేనని ఉర్దూలో స్పష్టంగా ఉన్నా... తప్పుడు అనువాదం తీసుకొచ్చి అవి పట్టా భూములంటూ ఒక అధికారి చేసిన అక్రమం ఈ కసరత్తులో వెల్లడైంది.

మంత్రికుంటలోనూ... మాయాజాలం!

  • సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రికుంట గ్రామంలోని అసైన్డు భూముల్లోనూ మాయాజాలం చోటుచేసుకుంది. ఇక్కడ సర్వే సంఖ్య 201లో 35 ఎకరాలను కొన్నేళ్ల క్రితమే 17 మంది రైతులకిచ్చారు. 2013 కంటే ముందుగానే వీటిని స్వాధీనం చేసుకొని ఖారీజ్‌ ఖాతాలో (నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అసైన్డ్‌భూముల క్రయవిక్రయాలు జరిపితే ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్వహించే ఖాతా) నమోదు చేశారు. ఈ భూమిని 2013లోనే ఇతరుల పేర్ల మీదకు మార్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరు ఇలా చేసి ఉంటారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా ధర రూ.50 లక్షలకు పైమాటే.
  • జిన్నారం మండలం మాదారంలోని సర్వే నంబరు 543లో 5 ఎకరాలు, 271లో 5 ఎకరాలను గతంలోనే ఖారీజుఖాతాలో చేర్చారు. ఈ భూములూ 2013 తర్వాత ఇతరుల పేర్ల మీదకు మారాయి. జిన్నారం మండలం గడ్డపోతారంలోని సర్వే నంబరు 66, 67లలోని ఎనిమిది ఎకరాలదీ అదే పరిస్థితి. ఇక్కడ ఎకరా రూ.4 కోట్ల వరకు ఉంది. అంటే అనర్హుల పరమైన భూమి విలువ రూ.32 కోట్ల వరకు ఉంటుంది.

ఇదీ చదవండిః'జీవో ఉల్లంఘించిన 55 పాఠశాలలకు షోకాజ్​ నోటీసులు'

ABOUT THE AUTHOR

...view details