మంత్రి కేటీఆర్(KTR) చొరవతో చిన్నారికి పునర్జన్మ లభించింది. రూ.లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందజేసి అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రి ఉదారత చాటుకుంది. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని గ్రామానికి చెందిన అవినాష్ దంపతులు కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నారు. వీరి కుమార్తె అక్షయ(2)కు మెడపై కణితి వచ్చి ప్రాణాంతకమైందిగా మారింది. తక్షణం తొలగించాలని వైద్యులు తెలిపారు.
శస్త్ర చికిత్సకు రూ.4-6 లక్షలు అవుతుందని చెప్పారు. అంత డబ్బులేని తల్లిదండ్రులు తమ దీన స్థితిని పలువురికి వివరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఆయన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వైద్యులతో మాట్లాడగా ఉచితంగా శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు. ఆసుపత్రి రోబోటిక్ ఆంకో సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు.
గతంలో హామీ
వింత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్య సాయానికి మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన సుమలత, అవినాశ్‌ల కుమార్తె అక్షయకు గత ఏడాదిగా మెడ చుట్టూ వాపు పెరుగుతోంది. లక్ష రూపాయలు ఖర్చు చేసినా... ఫలితం లేకపోయింది.