KTR on Electronic vehicles: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో మరో భారీ యూనిట్ నిర్మాణానికి ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ యూనిట్‌లో మహీంద్రా సంస్థ జోర్ గార్డ్ పేరుతో బ్యాటరీ వాహనాలను తయారు చేయనుంది. జోర్ గార్డ్ శ్రేణిలో మహీంద్రా రూపొందొంచిన మొదటి శ్రేణి వాహనాన్ని స్వయంగా కేటీఆర్ నడుపుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
తెలంగాణ మోబిలిటీ వ్యాలీ ఏర్పాటు: బ్యాటరీ వాహనాల తయారీ కోసం మహీంద్ర రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టడం అభినందనీయమని కేటీఆర్ కొనియాడారు. ఈ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుందని.. మరింత పెట్టుబడి పెట్టి భవిష్యత్‌లో పరిశ్రమను విస్తరించాల్సి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్ గుర్తించి.. రాష్ట్రంలో ఈవీ తయారీ రంగాన్ని ప్రోత్సాహించేందుకు ప్రత్యేక పాలసీ తెచ్చామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ మోబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.
రాజకీయ స్థిరత్వం, శాంతిభద్రతలు, పారదర్శక విధానం వల్ల.. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, వేల పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ విధానం తీసుకువచ్చామని తెలిపారు. 24గంటల నాణ్యమైన విద్యుత్ వంటి మౌళిక వసతులు కల్పించామని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా ఇప్పటి వరకు 23,000 పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని కేటీఆర్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే వీటి ద్వారా రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పారిశ్రామిక విధానం తెలంగాణలో ఉందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు నైపుణ్యాలు కల్పించేలా జహీరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.