Krishna Ella Chief Guest IIT Hyderabad Foundation Day: మన ఆచార వ్యవహారాల్లో సైన్స్ దాగుందని భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్ 15 వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్నోవేషన్ అండ్ అంట్రాపెన్యూర్ షిప్- ఇండియా నెక్స్ట్ సెంచరీ హబ్ అన్న అంశంపై ఐఐటీ ఫ్యాకల్టీ, విద్యార్థులను ఉద్దేశించి కృష్ణ ఎల్లా ప్రసంగించారు. సైన్సు గురించి సింపుల్గా ఆలోచించాలని.. కేవలం తరగతి గదిలో ఆవిష్కరణలు రావని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పాల్గొన్నారు.
ఐఐటీ హైదరాబాద్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా కార్యక్రమానికి విచ్చేసిన కృష్ణ ఎల్ల.. పాశ్చాత్య ప్రభావం మన జీవన విధానంపై ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అని.. 2100 సంవత్సరం వరకు కూడా ఇండియా యువత జనాభాలో మొదటి స్థానంలోనే ఉంటుందని అన్నారు. 2015లో ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ లో 81స్థానంలో ఉన్న భారత్ 2022లో 40 స్థానానికి ఎదిగిందని.. రాబోయే 3 సంవత్సరాల్లో మరింత మెరుగైన ర్యాంక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.