సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్‌కు వినతి పత్రం అందించారు. తాను ప్రాతినిధ్యం వహించే సంగారెడ్డి రామ మందిరం, సదాశివపేట ఎమ్‌ఆర్‌ఎఫ్ వరకు మెట్రో రైల్‌ను విస్తరించాలని కోరినట్లు స్పష్టం చేశారు. తన ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు అసెంబ్లీ లాబీలో చెప్పారు. సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని వెల్లడించారు. అదే విధంగా గ్రూప్ -1 మెయిన్స్ ఎంపిక విధానంలో ఒకటి నిష్పత్తి యాబై మందిని కాకుండా ఒకటి నిష్పత్తి వంద మందిని పిలవాలని కోరినట్లు జగ్గారెడ్డి వివరించారు
సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ విద్యాసంస్థలకు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జగ్గారెడ్డి వినతి పత్రం అందించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు రూ.5కోట్లు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు రూ.5కోట్లు, మహిళా డిగ్రీ కాలేజీకి రూ.5కోట్లు, సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలకు అదనపు గదులు, 150 మంది విద్యార్థినులు చదువుకుంటున్న మహిళా డిగ్రీ కళాశాలకు రూ.3కోట్లు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు రూ.3కోట్లు నిధుల మంజూరు చేయాల్సిందిగా కోరారు.