సిద్దిపేట లేనిదే కేసీఆర్ లేడనేది వాస్తమని.. కానీ కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదనడం అవాస్తవమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10నియోజకవర్గాల్లో ఎనిమిదింటిలో తెరాస శాసనసభ్యులే ఉన్నారని... సిద్దిపేట, గజ్వేల్ మినహాయిస్తే మిగతా 6నియోజకవర్గాల్లో తెరాస ఎమ్మెల్యేలే ఉండగా ఆ నియోజకవర్గాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్ లో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
సంగారెడ్డికి నిధులు ఇవ్వట్లేదు..
గత ఆరేళ్లుగా కేసీఆర్ సంగారెడ్డికి నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రతి జిల్లా కేంద్రాని ఈ-మెడికల్ కాలేజ్ ఇస్తానన్న కేసీఆర్ తన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. సోనియా, రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్ ఇంత అహంకారంగా మాట్లాడే వారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన రోజు మాట వరుసకు కూడా సోనియా, రాహుల్కు కేసీఆర్ కృతజ్ఞత తెలపకపోవడం దారుణమన్నారు.