Sangareddy Fruit Research Centre :సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అస్తబల్ ప్రాంతంలో నిజాం రాజులు దేశ విదేశాల నుంచి మామిడి మొక్కలను సేకరించి వందల ఎకరాలు విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో నాటారు. 400 రకాలకు పైగా వేలాది మొక్కలు నాటడంతో ఈ ప్రాంతం పెద్ద తోటగా మారింది. స్వాతంత్ర్యం తరువాత దీన్ని ప్రభుత్వం ఫల పరిశోధన కేంద్రంగా మార్చింది. మామిడితో పాటు జామ, శీతాఫలం, సపోటపైనా పరిశోధనలు నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పరిశోధనా కేంద్రాన్ని శ్రీ కొండ లక్షణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు.
Issues at Sangareddy Fruit Research Centre : గతంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీని అభివృద్ధి కోసం కృషి చేసి మామిడి రకాలను 477 వరకు పెంచారు. దసేరీ, కలాకాండ్, లంగ్డా, హిమాయత్, బేనిషాన్, పంచదార, చెరుకు రసాల్, నాగిని, మంజీర.. ఇలా వందల రకాల పండ్లు ఇక్కడ దొరుకుతాయి. వెయ్యి మామిడి రకాలతో పూణెలోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ ఉంది. ఇక్కడి తోటలో పండిన పండ్లను ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. మేలైన రకాలతో పాటు రసాయనాల వినియోగం తక్కువగా ఉండటం, సహజ సిద్ధంగా మాగబెట్టి అమ్మడంతో ఇక్కడి పండ్లకు మంచి డిమాండ్ ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా కొనుగోలుదారులు తగ్గిపోతున్నారు.