ISRO Chairman Chief Guest In IIT Hyderabad Convocation : భవిష్యత్‌లో మనుషులకు.. రోబోలకు మధ్య ఉన్న అంతరం చెరిగిపోయే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత మనిషి జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చిందని.. అత్యాధునిక సాంకేతిక ఉన్న వాళ్లే ప్రస్తుత ప్రపంచంలో శక్తివంతులని వివరించారు. ఐఐటీ హైదారాబాద్ 12వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులకు పతకాలు, పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ హైదారాబాద్ మొదటితరం ఐఐటీలకు దీటుగా నిలుస్తోందని పేర్కొన్నారు. నిరంతర శ్రమతోనే ఈ స్థానానికి చేరుకున్నారని విద్యార్థులను అభినందించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. మన పని తీరు, ప్రయత్నం గురించి విశ్లేషించే అవకాశం మరొకరికి ఇవ్వొద్దని అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల మీద దృష్టి సారించి.. వాటి కోసం ప్రయత్నించాలన్నారు. కెరీర్ ప్రారంభంలో అంతిమ లక్ష్యం చేరుకోలేమని.. నిరంతర ప్రయత్నంతో దానిని చేరుకోవచ్చన్నారు. అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సోమనాథ్ సూచించారు.
12th Graducate Cermony IIT Hyderabad : ఆధునిక సాంకేతికత మనిషి జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చిందని.. అత్యాధునిక సాంకేతిక ఉన్న వాళ్లే ప్రస్తుత ప్రపంచంలో శక్తివంతులని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. భవిష్యత్ టెక్నాలజీ, ఆవిష్కరణలు చేసే వారే దేశ భవిష్యత్‌ను మార్చుతారని అన్నారు. ఆకలి, వ్యాధులు వంటి వాటిని జయించిన మనిషి.. ఇప్పుడు శాశ్వతంగా జీవించాలన్న ఆశతో ఉన్నాడని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత అభివృద్ధి వల్ల అది సాధ్యం కావచ్చన్నారు. రోబోలకు ఫీలింగ్స్, ఎమోషన్స్, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదని.. భవిష్యత్తులో దీన్ని సైతం అధిగమించే అవకాశం ఉందన్నారు. భవిష్యత్ ప్రయాణం తల్లిదండ్రులకు, మీ గురువులకు గర్వకారణంగా ఉండాలని సోమనాథ్ విద్యార్థులకు సూచించారు.