- ఈటీవీ భారత్ ప్రతినిధి: కొవిడ్ 19 ట్రాకర్. ఇన్ ప్రత్యేకతలు ఏంటి.?
బీఎస్ మూర్తి: ఈ కొవిడ్ 19 ట్రాకర్ దేశ వ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని సేకరించి క్రోడికరిస్తుంది. కేవలం ఒక్క క్లిక్‌తో కరోనా కేసులు, నిర్ధరణ పరీక్షలు, వ్యాక్సినేషన్ వంటి పూర్తి సమాచారం, భవిష్యత్ అంచనాలు, ముందస్తు సూచనలు వంటివి ఈ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు. దీంతో పాటు కీలకమైన సమాచారాన్ని పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచుతున్నాం.
- కొవిడ్ 19 ట్రాకర్. ఇన్ వెబ్సైట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది.?
-గతంలో కొవిడ్19ఇండియా.ఆర్గ్ అనే వెబ్‌సైట్‌ను కొంతమంది యువకులు నిర్వహించేవారు. కరోనా ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని సేకరించి ఈ వెబ్సైట్ ద్వారా అందించే వారు. ఈ సమాచారం ఆధారంగానే దేశంలో కరోనా అంచనాలతో పాటు పరిశోధనలు కూడా జరిగేవి. కానీ నవంబర్ నుంచి ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు వారు ఆగస్టులో ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కరోనా పూర్తి సమాచారంతో మేమే ఓ వెబ్సైట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఐఐటీ హెచ్‌లోని కంప్యూటర్ సెంటర్ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కేవలం నెల రోజుల్లోనే కొవిడ్19ట్రాకర్.ఇన్ వెబ్సైట్ రూపొందించాం.
- ఎప్పటికప్పుడు దేశ వ్యాప్త సమాచారాన్ని సేకరించడం ప్రభుత్వ విభాగాలకే కష్టతరం. మరి మీరు సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నారు.?
- ప్రతి రాష్ట్రం వారి పరిధిలోని కరోనా సమాచారాన్ని ప్రతిరోజు వివిధ మార్గాల ద్వారా విడుదల చేస్తోంది. మా బృందం ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి.. వెబ్సైట్లో పొందుపరుస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారం మాత్రమే ఇందులో ఉంటుంది.
- వెబ్సైట్ నిర్వహణలో ఎంత మంది నిమగ్నమయ్యారు. వారి ప్రత్యేకతలు ఏంటి.?
-ప్రముఖ శాస్తవేత్త, సూత్ర కన్సోసీయం సభ్యులు ఆచార్య విద్యాసాగర్, ఐఐటీ హెచ్ కంప్యూటర్ సెంటర్ భీమార్జన రెడ్డి ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆచార్యులు, విద్యార్థులు సైతం పాలు పంచుకుంటున్నారు.
- కొవిడ్19ట్రాకర్. ఇన్ నిర్వహణలో సూత్ర మోడల్‌ను వినియోగిస్తున్నారు. ఈ సూత్ర మోడల్ అంటే ఏంటి.?