తెలంగాణ

telangana

ETV Bharat / state

వినూత్న ఆలోచన... పంట చేతికొచ్చింది - innovatice

తీవ్ర వర్షాభావం.. దీనికి తోడు మండే ఎండలు.. బోర్లు ఒక్కొక్కటిగా వట్టిపోతున్నాయి. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. పంటలు కాపాడుకునేందుకు అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ట్యాంకర్లతో నీటిని తెచ్చి పోస్తుంటే.. మరి కొందరు ఏమీ చెయ్యలేక.. భగవంతుని మీద భారం వేసి నిస్సహాయంగా చూస్తున్నారు. కానీ సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు తన పంటను కాపాడుకోవడానికి ఓ విచిత్ర ప్రయత్నం చేస్తున్నాడు.

వినూత్న ఆలోచన... పంట చేతికొచ్చింది

By

Published : Apr 19, 2019, 7:14 AM IST

Updated : Apr 19, 2019, 7:57 AM IST

సంగారెడ్డి జిల్లా మల్లేపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్​కు వ్యవసాయమే జీవనాధారం. తనకు ఉన్న భూమితో పాటు అదే గ్రామంలో మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, చెరకు సాగు చేశాడు. ఖరీఫ్ కలిసి రాకపోవడం వల్ల కనీసం రబీలోనైనా.. గిట్టుబాటు కాకపోతుందా...? అన్న ఆశతో వరి సాగు చేశాడు.

వినూత్న ఆలోచన... పంట చేతికొచ్చింది

అడుగంటిన భూగర్భ జలాలు....

వరుణుడు ముఖం చాటేయడం వల్ల భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోయాయి. బోరు బావులు ఎండిపోయాయి. శ్రీనివాస్ కౌలుకు తీసుకున్న పొలంలో ఉన్న మూడు బోర్లు వట్టిపోవడం వల్ల సుమారు ఏడు ఎకరాల్లో సాగు చేసిన.. వరి, చెరకు పంట ఎండిపోయింది. తన సొంత పొలంలో ఉన్న రెండు బోర్లపై ధీమాతో ఎకరంన్నరలో వరి నాటు పెట్టాడు. ఈ బోరు బావులు వట్టిపోయి పొలం ఎండిపోవడం ప్రారంభమైంది. ఎలాగైనా పంటను కాపాడుకోవాలనుకున్న శ్రీనివాస్​కు ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే తన పొలానికి ఆధారమైంది.

మురుగుకాలువే కాపాడింది...

తన పొలం పక్కనుంచి వెళ్తున్న మురుగునీటిని సాగు కోసం వినియోగించుకోవాలని శ్రీనివాస్​కు ఆలోచన వచ్చింది. వెంటనే మురుగు కాలువకు అడ్డు కట్ట వేసి.. పెద్ద గుంత తవ్వాడు. ఆ గుంతలో మోటారు పెట్టి.. మురుగు నీటిని తన పొలానికి మళ్లించుకుంటున్నాడు. బోర్లు ఎండిపోయి.. పంట చేతికందని పరిస్థితుల్లో.. మురుగు నీరు.. ఆ పంటకు ఆధారమైంది.

గతంలో గ్రామంలో తాగు నీటి కొరత వస్తే.. శ్రీనివాసే తన బోరు ద్వారా గ్రామస్థులందరికీ.. తాగు నీరు అందించారు. అటువంటిది ప్రస్తుతం తనకే నీటి కష్టం రావడం వల్ల గ్రామం నుంచి వస్తున్న మురుగు నీటితో పంట కాపాడుకుంటున్నాడు.

ఇవీ చూడండి:

కొండంతా భక్తజనం... మారుమోగేను రామనామం

Last Updated : Apr 19, 2019, 7:57 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details