Illegal crushers in sangareddy district: సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్థనూర్ గ్రామంలో సర్వే నెంబర్లు 231, 259 పరిధిలో 800 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇందులో సగం ప్రభుత్వ భూమి. ఈ భూమిలో కొంత భాగాన్ని భూమిలేని నిరుపేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుని జీవిస్తున్నారు. వీరితో పాటు గ్రామంలోని నిరుపేదలకు అధికారులు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. 2005లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఈ భూమి కేటాయింపు పత్రాల్ని లబ్ధిదారులకు అందించారు. నాటి నుంచి తమకు కేటాయించిన భూముల్లో లబ్దిదారులు పంటలు పండిస్తున్నారు.
ఈ భూముల చుట్టూ బండలు, కొండలు ఉండటంతో క్రషర్ వ్యాపారులు ఈ సర్వే నెంబర్ల పరిధిలోని కొంత పట్టా భూములు కొనుగోలు చేశారు. తాము కోనుగోలు చేసిన పట్టా భూముల్లో క్రషర్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారు. అయితే... క్వారీ తవ్వకాలు, క్రషర్ల ఏర్పాటంతా అసైన్డ్ భూముల్లోనే సాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
క్రషర్ వ్యాపారులు సంవత్సరానికి 2 నుంచి 6లక్షల రూపాయల వరకు లీజు చెల్లిస్తామంటూ 231, 259 సర్వే నెంబర్ల పరిధిలోని కొంతమంది అసైన్డ్ రైతులకు ఆశ చూపారు. కొంతమంది డబ్బు తీసుకుని లీజు ఒప్పందాలు చేసుకోగా... చాలా మంది రైతులు తిరస్కరించారు. లీజుకు ఇచ్చిన వారికి కూడా నామమాత్రంగానే లీజు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులు తమ భూముల్లో తవ్వకాలు జరగకుండా అడ్డుకోవడంతో.. క్రషర్ల యజమానులు రాత్రి వేళల్లో దొంగచాటుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. పెద్దపెద్ద యంత్రాలతో, భారీ పేలుళ్లతో తెల్లవారే సరికి తవ్వకాలు జరిపి.. గోతులు తవ్వారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.