IIT Hyderabad Innovation Day: ఆవిష్కరణల కేంద్రం ఐఐటీ హైదరాబాద్ మొట్టమెదటిసారిగా ఇన్నోవేషన్ డే ఘనంగా నిర్వహించింది. ఇందులో ఐఐటీ హైదరాబాద్ ఇంక్యూబెషన్ కేంద్రంలో అభివృద్ధి చేసిన 30ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఆవిష్కరణను ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లినప్పుడే పూర్తి స్థాయి ఫలితం లభిస్తుందని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థులు చేస్తున్న అద్భుత ఆవిష్కరణలకు పారిశ్రామిక వేత్తలు తమ సంస్థల్లో చోటు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐఐటీ హైదరాబాద్‌ను ఆవిష్కర్తలకు స్వర్గథామంగా చేయాలన్నది తమ లక్ష్యం అని డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి తెలిపారు.
"2020-21 సంవత్సరంలో 4వేల 600 అంకుర సంస్థలు మూతపడ్డాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఆవిష్కరణలకు సంబంధించి 80 వేల అంకుర సంస్థలు పుట్టుకురావడం గర్వంగా చెప్పుకునే పరిణామం. అదే సమయంలో మూతపడకుండా నియంత్రించాల్సిన అవసరమూ ఉంది. ఈ సంస్థలో జరుగుతున్న ఆవిష్కరణలు కింది స్థాయి సామాన్యుల వరకు చేరాలి. కేవలం ఐఐటీ, ఎన్‌ఐటీలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చేరాలని ఆకాంక్ష." - శ్రీవారి చంద్రశేఖర్, కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి
"సాంకేతికత-పరిశోధన, సాంకేతిక-ఆవిష్కరణలకు ఐఐటీలో ప్రాధాన్యమిస్తాం. ప్రపంచంలో ఏ మూలలో వినూత్నమైన ఆలోచన ఉన్నా.. దాన్ని ఐఐటీ హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఈ క్రతువులో పారిశ్రామిక వేత్తలు చేయూతనివ్వాలని ఆకాంక్షిస్తున్నా."-ఆచార్య బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్
క్యాన్సర్‌ను గుర్తించే కిట్: ఐఐటీ హైదరాబాద్ ఇంక్యూబేషన్ సెంటర్లో చేసిన ముఖ్యమైన 30 ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇంటి వద్దే అతి తక్కువ ధరలో సర్వైకల్ క్యాన్సర్ గుర్తించే కిట్‌ను బయోమెడికల్ విభాగానికి చెందిన ఆచార్యులు అరవింద్ కుమార్ రెంగన్ నేతృత్వంలో రూపొందించారు. చుట్టూ ఉన్న పరిసరాల నుంచే బ్యాటరీలను ఛార్జ్ చేసే విన్నూత్నమైన సాంకేతికతను గ్రీన్ పీఎంయూ సెమీ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసింది.