తెలంగాణ

telangana

ETV Bharat / state

Omar Abdullah: 'నేనే దేశ ప్రధానిని అయితే.. అఫ్గాన్‌ శరణార్థుల్ని ఆదుకునేవాణ్ని' - Koutilya School of public policy

యువత రాజకీయాల్లోకి రావాలని.. వంశపారంపర్యంగా వస్తున్న రాజకీయాలను అధిగమించి కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉందని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ పాలసీ తొలిబ్యాచ్‌తో సోమవారం జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఒమర్‌ సమాధానమిచ్చారు.

omar abdullah
ఓమర్ అబ్ధుల్లా

By

Published : Aug 16, 2021, 10:25 PM IST

Updated : Aug 17, 2021, 7:12 AM IST

'నేనే ప్రధానిగా ఉండుంటే అఫ్గాన్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చేవాడిని'

తాను దేశ ప్రధానిని అయితే అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చే శరణార్థుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించేవాడినని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి భారత్‌లో ఆశ్రయం కల్పించే విధంగా చొరవ తీసుకునేవాడినన్నారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న క్రమంలో మన దేశానికి ఇబ్బందులు ఉండకపోవచ్చన్నారు. సరిహద్దులు బలోపేతం కావడం, చొరబాట్లు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ పాలసీ తొలిబ్యాచ్‌తో సోమవారం జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఒమర్‌ సమాధానమిచ్చారు.

కశ్మీర్‌ ‘దిల్లీ సే దూర్‌- దిల్‌ సే దూర్‌’ అన్నట్లున్న పరిస్థితి మారాలని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పటివరకు ఆ దిశగా నిర్మాణాత్మక చర్యలేవీ చేపట్టలేదన్నారు. ఏకపక్షంగా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్‌ను విభజించడంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారన్నారు. కశ్మీర్‌ యువత అంతా గన్‌లు పట్టుకోలేదని, కేవలం కొందరు తమకున్న కారణాలతో వాటిని చేతబూనారన్నారు. అన్నింటికీ మించి దేశమే గొప్పదని వివరించారు. పాకిస్థాన్‌-భారత్‌ల మధ్య ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సత్సంబంధాలు నెలకొనే పరిస్థితులు లేవన్నారు.

ఆర్టికల్‌ 370.. రాజ్యాంగ వారధి

కశ్మీర్‌కు, దేశానికి మధ్య ఆర్టికల్‌ 370 రాజ్యాంగ వారధి అని, దీనిని బలహీనపరిచారే కానీ, ఇప్పటికీ పూర్తిగా తొలగించలేదని ఒమర్‌ అన్నారు. దీని రద్దు నిర్ణయాన్ని పాకిస్థాన్‌ వ్యతిరేకించడం ద్వారా.. భారత ప్రభుత్వానికే అనుకూలంగా వ్యవహరించినట్లయిందన్నారు. గీతం అధ్యక్షుడు భరత్‌, వైస్‌ఛాన్స్‌లర్‌ కె.శివరామకృష్ణ, ప్రొ వైస్‌ఛాన్స్‌లర్‌ ఎన్‌.శివపస్రాద్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ మనీకా రైక్వార్‌లు పాల్గొన్నారు.

ఒకవేళ నేను ప్రధాని స్థానంలో ఉంటే అఫ్గానిస్తాన్​లో జరిగే పరిస్థితులను మానవీయ కోణంలో చూస్తాను. అఫ్గానిస్తాన్ ముస్లిం దేశం...ఇక్కడ మతాన్ని పక్కన పెడితే... మానవత దృక్పథంతో ఆలోచించి అఫ్గాన్ వాసులకు ఆశ్రయం కల్పించే విధంగా కృషి చేస్తాను. వీలైనంత మందికి ఆశ్రయం కల్పించేవాడిని.

-- ఓమర్ అబ్ధుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం

ఇదీ చూడండి:KTR: 'అంబేడ్కర్​ ఆశయాల దిశగా తెరాస పాలన'

Last Updated : Aug 17, 2021, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details