తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్తా.. కొత్త పార్టీ పెడతా : జగ్గారెడ్డి - జగ్గారెడ్డి వార్తలు

Jaggareddy on Resign : తనపై కోవర్టును అనే ముద్ర వేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై బురద చల్లుతున్నందునే పార్టీని వీడాలని భావించానని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ బాగుండాలనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నుంచి బయటకెళ్లినా... వేరే పార్టీలో చేరనని పేర్కొన్నారు.

jaggareddy
jaggareddy

By

Published : Feb 19, 2022, 5:37 PM IST

Updated : Feb 19, 2022, 7:10 PM IST

కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్తా.. కొత్త పార్టీ పెడతా : జగ్గారెడ్డి

Jaggareddy on Resign : తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లగానే కొత్త రాజకీయ పార్టీ పెడతానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బయటకు వెళ్లడం అనేది ఖాయమని... కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్‌ కూడా తానేనని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పీసీసీ నాయకత్వంపై మనస్తాపం చెందిన ఆయన పార్టీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

వాళ్లను కలిస్తే తప్పేంటని

కోవర్ట్ అంటూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలనుకున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ చర్యలకు ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే తాను పార్టీ వీడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనపై సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న దుష్ప్రచారంపై పీసీసీ అధ్యక్షుడు స్పందించకపోవడం దుదృష్టం అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్​ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. విపక్షంగా ఉన్నప్పుడు అభ్యర్థిస్తే పొరపాటు ఎలా అవుతుందని అన్నారు. సీఎం, మంత్రిని కలువద్దంటే ఎలా కుదురుతుందని... నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధం చెప్పాలని నిలదీశారు.

బయటకు వెళ్లాలనే నిర్ణయించుకున్నా...

'ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లోనే ఉండాలని అనుకున్నా. నేను కాంగ్రెస్‌లో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ బాగుండాలనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా. కాంగ్రెస్‌ నుంచి బయటకెళ్లినా... వేరే పార్టీలో చేరను. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కొందరు చెప్పారు. ఆలోచించి నాలుగైదు రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తా. కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లాలనే నిర్ణయించుకున్నా. పార్టీ పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా.' - జగ్గారెడ్డి

నేనే బ్యానర్​ను

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉందని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌పై అసోం సీఎం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని గుర్తు చేశారు. గొప్ప కుటుంబం దృష్ట్యా... కేసీఆర్‌ కాదు... ఏ నాయకుడైనా స్పందిస్తారని అన్నారు. తనకు ఊహ తెలిసిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. తాను స్వంతంత్రంగా రాజకీయాల్లో వచ్చానని... అలాగే ఉంటానని స్పష్టం చేశారు. తనకు బ్యానర్ అవసరం లేదని.. తానే ఒక బ్యానర్‌ని అని చెప్పారు. తాను పార్టీని వీడినా... కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని జగ్గారెడ్డి అన్నారు.

మూడు రోజులు వాయిదా అంతే!

తన సామర్థ్యం తక్కువగా అంచనా వేయవద్దని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. కోవర్ట్ అని ముద్ర వేయడం వల్ల తాను కాంగ్రెస్ వీడాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ సీనియర్ నేతలు వీహెచ్‌, దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి లాంటి నేతలు తొందరపడవద్దు అని సూచన మేరకు రాజీనామా తాత్కాలికంగా మూడు రోజులు వాయిదా వేసుకుంటున్నానని చెప్పారు. ఈ లోగా ఆ నేతలను ఒప్పించి బయటకు రావడం ఖాయమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

జగ్గారెడ్డిని కలిసిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు

జగ్గారెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కలిశారు. జగ్గారెడ్డి పార్టీ వీడతానని ప్రకటన దృష్ట్యా భేటీ అయ్యారు. తొందరపాటు నిర్ణయం వద్దంటూ జగ్గారెడ్డిని శైలజానాథ్‌ బుజ్జగించారు. పార్టీ సీనియర్లతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. రాహుల్‌గాంధీని కూడా కలిసి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి :ఇక నుంచి కాంగ్రెస్​ పార్టీ గుంపులో లేను: జగ్గారెడ్డి

Last Updated : Feb 19, 2022, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details