నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించిన హరీశ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. కల్హేర్ మండల కేంద్రంలో నిర్మించిన 50పడకల ఆసుపత్రి, నిజాంపేటలో నిర్మించిన పశువైద్యశాలను మంత్రి ప్రారంభించారు. రాపర్తి, సంజీవన్‌రావు పేట గ్రామాల్లో 30రోజుల ప్రణాళికలో పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించండి..
ఫోన్ చేస్తే గర్భిణీలను ఆసుపత్రికి తీసుకువచ్చి.. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసి.. కేసీఆర్ కిట్ ఇచ్చి తిరిగి పంపిస్తున్నామని హరీశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకునేలా.. ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. రెండు రోజుల్లో కల్హేర్ ఆసుపత్రికి అదనపు సిబ్బంది.. త్వరలో ఆత్యాధునిక పరికరాలు అందిస్తామని ఆయన హమీ ఇచ్చారు.
కాగితాల్లో ఇళ్లు.. చేతిలో బిల్లు..
బల్కంచెల్క తండాలో రెండు పడక గదుల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న హరీశ్.. కాంగ్రెస్ అంటే కాగితాల్లో ఇళ్లు.. చేతిలో బిల్లు అని ఆయన ఎద్దేవా చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామని 2004, 2009ఎన్నికల్లో హమీ ఇచ్చిన కాంగ్రెస్.. గెలిచిన తర్వాత ఒక్క తండాను పంచాయతీగా మార్చలేదని ఆరోపించారు. తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని గుర్తు చేశారు.
ప్రజలు పారిశుద్ధ్యానికి.. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ప్రజలకు సూచించారు. 30 రోజుల ప్రణాళికతో స్వచ్ఛ గ్రామాలుగా మార్చుకోవాలన్నారు. పంచాయతీలకు ప్రతినెల నిధులు విడుదల చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: సచివాలయంలో తెలంగాణ ప్రవేశద్వారానికి తాళం