Minister Harish Rao at Gajwel BRS Athmiya Sammelanam: తాను తెలంగాణ రాకముందు సిద్ధిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ నాడు రైతులు, చేనేత కార్మికులు చనిపోతే పక్క రాష్ట్రాల నుంచి విలేకరులు వచ్చి వార్తలు రాసేవారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మంత్రి.. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని కేవలం 6 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపారని తెలిపారు. గతంలో గణేశ్ నిమర్జనాలు, బతుకమ్మ పండుగలు వస్తే ఏ చెరువులో వేయాలో తెలియక ప్రజలు గందరగోళానికి గురయ్యేవారని అన్నారు.
గతుకులున్న గజ్వేల్‌ను బతుకుల నిలయంగా: సీఎం కేసీఆర్ గజ్వేల్‌కు వచ్చాక రింగు రోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యాములు తెచ్చారని హరీశ్ రావు తెలిపారు. గతుకులుగా ఉన్న గజ్వేల్‌ను బతుకుల నిలయంగా మార్చింది కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ రాకముందు ఇక్కడ యాసంగిలో 7 వేల ఎకరాల సాగు చేసేవారని.. ఇప్పుడు 17 వేల ఎకరాలను సాగు చేస్తున్నారని వెల్లడించారు. 60 ఏళ్లు వెనుక ఉన్న ఈ ప్రాంతాన్ని 60 ఏళ్లు ముందుకు తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్రంలో తనకు తెలిసి పార్టీలను రెండు పర్యాయాలు నిలబెట్టిన వారు ఇద్దరే ఇద్దరని వారు.. ఒకరు ఎన్టీఆర్ మరొకరు కేసీఆరే అని తెలిపారు.