Harish Rao on Hyderabad Development: పేదలు ఆత్మ గౌరవంతో బతికాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి అన్ని సౌకర్యాలతో దాదాపు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
అందులో భాగంగా తొలి విడతలో ఎన్‌ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్‌లైన్ డ్రా నిర్వహించారు. 11 వేల 700 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఈ నెల 2న 8 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్లు పంపిణీ చేశారు. ఈ నెల 15న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్‌లైన్ డ్రా నిర్వహించి మరో 13 వేల 300 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. డ్రాలో ఎంపికైన లబ్దిదారులకు నేడు 9 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్లను పంపిణీ చేశారు.
Harish Rao Distributed 2BHK Houses in Kollur :సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు-2లో 4800 మందికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని పనులను కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కుళాయి ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నామని.. కొల్లూరులోప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, బస్తీ దవాఖానా(Basti Dawakhana Telangana) ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కొల్లూరుకు ఆర్టీసీ బస్సులు వచ్చేలా చూస్తామన్న హరీశ్ రావు .. ప్రపంచమంతా భాగ్యనగర అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ అభివృద్ధి 'రజినీ'కి అర్థమైందని.. ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ గజినీలకు మాత్రం కనపడటం లేదని మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని గల్లీ గల్లీకి, ఇంటింటికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు ఎన్ని దొంగ డిక్లరేషన్‌లు ప్రకటించినా.. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.