రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో ఆందోళన నిర్వహించారు. గ్రామ పంచాయితీ కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళన
రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్మికులు కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. వేతనాలు వెంటనే మంజూరు చేయాలంటూ నినాదాలు చేశారు.
నవంబర్, డిసెంబర్ జీతాలు చెల్లించలేదని గ్రామపంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదని వాపోయారు. కార్మికుల ధర్నాకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు మద్దతు పలికారు. సంక్రాంతి పండుగ సమయంలో జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నించారు. పంచాయతీ కార్మికుల జీతాలు ఇచ్చే వరకు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.