కరోనా వ్యాప్తి వేళ చాలా మంది సరైన సలహాలు, సూచనలు అందక ఇబ్బంది పడుతున్నారు. కొందరు అధిక మోతాదులో మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరైన సమయంలో వారికి అండ దొరక్కపోవడంతోనూ కష్టాలు తప్పడం లేదు. కొవిడ్‌తో కోలుకున్న తర్వాత కూడా కొందరిలో వివిధ రకాల రుగ్మతలు తలెత్తుతున్నాయి. దీంతో ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయోననే భావనతో కొందరు అధైర్యపడుతున్నారు. ఇలాంటి వారందరికీ ఉపయుక్తంగా ఉండేలా 35 మంది వైద్యులు సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. రానున్న రోజుల్లో మరింత మంది నిపుణులైన వైద్యుల సహకారమూ తీసుకోనున్నారు.
కొవిడ్ ఒక్కటే కాదు..
72072 18203.. ఈ నంబరుకు ఫోన్ చేస్తే కేవలం కొవిడ్ ఒక్కటే కాదు.. ఇతరత్రా ఏమైనా ఆరోగ్య సమస్యలున్నా వాటికీ సలహాలు అందిస్తారు. సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులూ ఈ జాబితాలో ఉండటంతో అవసరం మేరకు ఆయా ఆసుపత్రుల్లో చేర్పించి తక్షణం తగిన వైద్య చికిత్సలు అందేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. బాధితుల పరిస్థితిని బట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యాధికారులతోనూ వీరు మాట్లాడుతూ.. వైద్య సాయం త్వరగా అందేలా చొరవ తీసుకుంటున్నారు. ఈ బృందంలోని వైద్యులు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌కి అందుతున్న చికిత్సా పద్ధతులు, మారుతున్న విధానాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ మేరకు జిల్లా వాసులకు మేలు జరిగేలా చొరవ చూపుతున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు చర్మ, కంటి, జీర్ణకోశ సమస్యలు.. ఇలా చాలా రకాల సమస్యలకు సరైన సలహాలు, సూచనలు వీరి నుంచి పొందవచ్చు.