Four Jobs in One Family in Sangareddy : పని దొరికింది అంటే చాలు.. రాత్రి, పొద్దున అన్న తేడా లేదు. పిల్లల కడుపు నింపాలి. వారిని బాగా చదివించాలి.. అదే తపనతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆ తల్లిదండ్రులు. చెరకు సీజన్ వస్తే వలస వెళ్లాల్సిందే. నిజామాబాద్, మెట్పల్లి జిల్లాలు తిరుగుతూ చెరకు నరికి ఎడ్లబండ్లలో కర్మాగారాలకు ఇచ్చేవారు. ఇలా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించారు. భూమి ఉన్నా.. అందులో రాళ్లూ-రప్పలే ఉండడం వల్ల అక్కడ ఎలాంటి పంట పండదు. వారికి ఉన్న ఒకే ఒక్క మార్గం కూలీ. అలా వచ్చిన ప్రతి కష్టాన్ని అనుభవించి వచ్చిన డబ్బులతో పిల్లల్ని బాగా చదివించారు.
తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన ఆ పిల్లలు.. రేయింబవళ్లు కష్టపడి చదివి సర్కారు కొలువు సాధించారు. తల్లిదండ్రులు పడిన కష్టానికి.. ఉద్యోగాలను బహుమతిగా ఇచ్చారు. అమ్మానాన్నలకు ఇక జీవిత కాలం వారిని సంతోషంగా చూసుకోవాలనుకున్న వారి కలను నిజం చేసుకున్నారు ఆ ముగ్గురు పిల్లలు. ఆ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన తను కూడా కుటుంబ కష్టాలను చూసి వారికి చేదోడుగా నిలవాలి అనుకుంది. వారి సహకారం... కట్టుకున్న భర్త సహాయంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించించి ఆ యువతి. మొత్తానికి ఒకే ఇంట్లో నలుగురికి సర్కారు కొలువులు రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.
Four Constable Jobs In One Family in Sangareddy : కూలీ కోసం వలస వెళ్లే ఆ కుటుంబంలో నలుగురికి పోలీసు ఉద్యోగాలు రావడంతో వారి ఆనందం అవధులు దాటింది. వారి విజయంతో ఆ తండా అంతా సంతోష వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పడిన సిర్గాపూర్ మండల్ పరిధిలో జముల తండాలో నెహ్రూ నాయక్ మరోనీ బాయ్‌కు ముగ్గురు సంతానం. కూలీ చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కొద్ది రోజుల క్రితమే పెద్ద కుమారుడి వివాహం చేశారు.